రోగులకు నమ్మకం కలిగించాలి
ఆ బాధ్యత ప్రభుత్వ వైద్యులదే
ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు
కె.కోటపాడు : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే బాధ్యత వైద్యులదేనని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి విచ్చేసిన ఆయన బుధవారం మధ్యాహ్నం స్థానిక 30 పడకల ఆస్పత్రిని సందర్శించారు. వార్డుల్లో కలియతిరిగి సేవలపై ఆరాతీశారు. మరుగుదొడ్లు, పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులు సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. అలాగే ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
ఆస్పత్రిలోని జనరేటర్ పనిచేయడం లేదని, దీనివల్ల ఆపరేషన్ల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు వేచలపు కాసుబాబు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ డీసీహెచ్ఎస్ నాయక్‌కు లేఖరాయాలని, దాని కాపీ తనకు ఇస్తే మంత్రితో మాట్లాడుతానని వైద్యులకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈర్లె గంగునాయుడు (నాని), కొత్తల సింహాచలంనాయుడు (నవీన్), తర్రా మురళీకృష్ణ, వర్రి చినరమణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
మాడుగుల : శాసన సభలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్ బూడి ముత్యాలనాయుడుకు బుధవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నియోజకవర్గ సమస్యలపై దృష్టిసారిస్తానని తెలిపారు.
స్వాగతం పలికిన వారిలో జెడ్పీటీసీ సభ్యురాలు గొల్లవిల్లి ప్రభావతి, నాయకులు గొల్లవిల్లి సంజీవరావు, రాఖి శ్రీను, వేమవరపు వెంకటధర్మజ (పెదబాబు), కనిశెట్టి నగేష్, బొద్దపు భాస్కరరావు, తాళపురెడ్డి రాజారాం, కొట్యాడ భాస్కరరావు, రొబ్బా మహేష్, కొట్యాడ కృష్ణమూర్తి, అశోక్, సయ్యపురెడ్డి నారాయణరావు, రాజుతాత, చెల్లంనాయుడు, దాడి రాజేశ్వరరావు, గోకాడ అప్పారావు తదితరులున్నారు.