ఇంకెన్నాళ్లీ అగచాట్లు..
బాలికల చదువుకు ఎన్నో అడ్డంకులు.. ఎంవీ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి
అరకొర అవకాశాలు, ఆకలి, పేదరికం.. ఆర్థిక సమస్యలే అధికం
వారంలో రెండు రోజులు కూలికి వెళ్తున్న విద్యార్థినులు 60 శాతంపైగానే..
లైంగిక వేధింపులకు గురవుతున్నామని చెప్పినవారు 34.1 శాతం మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునేందుకు ఆడపిల్లలకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. చదువుకునే అవకాశాల దగ్గరి నుంచి కుల వివక్ష, లైంగిక వేధింపుల వ రకూ నిత్యం ఏదో ఒక సమస్యతో వారు కొట్టుమిట్టాడుతున్నారు. సర్కారు బడులు, కాలేజీల్లో చదువుతున్న బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంవీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ చేపట్టిన అధ్యయనంలో ఇటువంటి ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.
సోమవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ శైలాజా రామయ్యర్, జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతా సిన్హా ఈ సర్వే వివరాలను విడుదల చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ర్యాండమ్ పద్ధతిలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 5 ప్రైవేట్ కళాశాలలు, నాలుగు రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులను ప్రశ్నించి.. ఈ సర్వే నివేదికను రూపొందించారు.
పరిస్థితులకు అద్దం పడుతున్నాయి..: ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని ఇంటర్ బోర్డు కమిషనర్ శైలజా రామయ్యర్ పేర్కొన్నారు. విద్యార్థినులకు ఫీజుల చెల్లింపు, హాస్టల్ సౌకర్యం, ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థినులకు ఉచిత బస్‌పాస్‌లను అందించడం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి... ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు.
ఈ సర్వే వివరాల ద్వారా బాలికల దుర్భర పరిస్థితి వెల్లడైందని.. వారి చదువుకు తోడ్పడేలా ప్రభుత్వం విధానాలు రూపొందించాలని శాంతసిన్హా పేర్కొన్నారు. విద్యార్థినులకు చదువుకునే అవకాశాన్ని మెరుగుపర్చాలంటే మొదట ప్రతి నియోజకవర్గంలో ఒక బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఈనాటికీ అక్షరాలు నేర్వని, నేర్చుకునే వీలులేని పరిస్థితులు ఉండడం విచారకరమని ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఎం.వెంకటరెడ్డి పేర్కొన్నారు.
సర్వే వివరాలివీ..
రాష్ట్రంలోని 62.7 శాతం మంది బాలికలు జూనియర్ కాలేజీ స్థాయిలోనూ కూలి పనికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. వారానికి రెండు రోజులు కూలిపనికి వెళుతున్నామని 46.2 శాతం బాలికలు వెల్లడించారు.
వారానికి 1 నుంచి 3 రోజులు మాత్రమే కాలేజీకి వెళ్లే ముందు తింటామని, మిగతా రోజుల్లో ఖాళీ కడుపుతోనే కాలేజీకి వెళ్లాల్సి ఉంటుందని 30.2 శాతం మంది చెప్పారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న దళిత, ఆదివాసీ విద్యార్థినుల్లో 98.1 శాతం మంది ఉపాధ్యాయుల నుంచి కులవివక్ష ఎదుర్కొంటున్నామని చెప్పారు.
ఇక 19.6 శాతం మంది బాలికలు ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురైనట్లు సర్వే వెల్లడించింది. వారిలో 37 శాతం మంది బాలికలు ప్రాథమిక స్థాయిలోనే లైంగిక వేధింపులకు గురయ్యామని చెప్పారు. ఇక 12 శాతం మంది ఉపాధ్యాయుల నుంచి లింగ వివక్ష ఎదుర్కొన్నామని చెప్పారు.
దాదాపు అందరు విద్యార్థినులు తాము ఇంటినుంచి కళాశాలకు వెళ్లడం, రావడం వల్ల వారికి సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలలకు అనుబంధంగా హాస్టళ్లను నెలకొల్పితే చదువు కొనసాగించగలుగుతామన్నారు.
73.7 శాతం మంది బాలికలు తమ తల్లి మద్దతుతోనే చదువును కొనసాగించగలుగుతున్నామని, తండ్రి నుంచి ప్రోత్సాహం ఉండడం లేదని పేర్కొన్నారు.