నేటి నుంచే గ్రామీణ సాంకేతిక మేళా
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ)లో ఆరు రోజుల గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శనకు రూరల్ టెక్నాలజీ పార్కు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు 11వ గ్రామీణ సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఆర్డీ డెరైక్టర్ జనరల్ ఎం.వి.రావు తెలిపారు. గురువారం ఎన్ఐఆర్డీ ప్రధాన కార్యాలయంలో ఎం.వి.రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ నెల 13వరకు జరిగే మేళాలో 250 స్టాళ్లను అనుమతించామని.. రాష్ట్రం, దేశంలోని పలు ప్రాంతాల నుంచి హస్తకళలు, శాస్త్రసాంకేతిక ఉత్పత్తులు, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు మేళాలో ప్రదర్శనకు రానున్నాయని తెలిపారు. 50 కొత్త ప్రయోగాలు సందర్శకులను ఆకట్టుకుంటాయని, సోలార్ గ్రైండర్ మిక్సర్ ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గం టల వరకూ మేళా జరుగుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు రావడానికి రవాణా సౌకర్యం కల్పించినట్టు రావు తెలిపారు. ఎన్ఐఆర్డీకి 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 500 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో మారుమూల గ్రామాల యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రావు వివరించారు.