భద్రతకు మరో రూ. 4వేల కోట్ల వ్యయం
ముంబై: ఏటీఎంల వద్ద భద్రతను పెంచితే బ్యాంకులకు నెలకు రూ.4,000 కోట్లు అదనంగా ఖర్చవువుతుందని ఇండియన్ బ్యాంక్స్ ఆసోసియేషన్(ఐబీఏ) అంచనా వేసింది. బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి ఘటన కారణంగా ఏటీఎంల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఒక్కో ఏటీఎంకు భద్రత అవసరాల పెంపు కోసం నెలకు అదనంగా రూ.40,000 ఖర్చవుతుందని ఇండియన్ బ్యాంక్స్ ఆసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎం.వి. టంకసలే సోమవారం తెలిపారు. భద్రత పెంచాల్సిన ఏటీఎంలు లక్ష వరకూ ఉంటాయని, వీటిపై బ్యాంకులు నెలకు రూ.4,000 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని వివరించారు. ఈ భారాన్ని తట్టుకోవడానికి బ్యాంకులు యూజర్ చార్జీలను పెంచక తప్పదని నిపుణులంటున్నారు. ఇప్పటికే 1.4 లక్షల ఏటీఎంలకు తగినంత భద్రత ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.15గా ఉన్న ఇంటర్ బ్యాంక్ ఫీజును రూ.18కు పెంచాలని, ప్రతి లావాదేవీపై చార్జీల విధింపుకు అనుమతించాలని ఆర్బీఐను కోరతామని టంకసలే చెప్పారు.