కొత్త నోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్.. కొత్త 2వేలు, 500 రూపాయల నోట్లను చూపించారు. అప్పటికే భారీ మొత్తంలో ఈ నోట్లు రిజర్వు బ్యాంకుకు చేరుకున్నాయి. కానీ వీటన్నింటినీ ఎక్కడ ముద్రించారు, ఎలా తీసుకొచ్చారు? ఇదంతా ఆసక్తికరమే. గత ఆరు నెలలుగా ఒక చార్టర్డ్ విమానం నిండా కొత్త నోట్లను మైసూరులోని ప్రభుత్వ ప్రెస్ నుంచి ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయానికి తరలిస్తూనే ఉన్నారు.
ఇన్నాళ్లుగా అసలు మైసూరులో విమానాశ్రయం ఎందుకు, అక్కడ అనవసరం అని భావించినవాళ్లు ఇప్పుడు ఈ విషయం తెలిసి నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇక్కడ ఒకే ఒక్క రన్వే ఉంది. అక్కడి నుంచే కొత్త నోట్లన్నీ సురక్షితంగా, అత్యంత రహస్యంగా ఢిల్లీకి, పలు నగరాల్లో ఉన్న రిజర్వు బ్యాంకు శాఖలకు చేరుకున్నాయి. మూడోకంటికి తెలియకుండా కేవలం అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పూర్తిచేయడంలో మైసూరు విమానాశ్రయానిది కూడా ప్రధాన పాత్రే.
500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించేసరికే ఈ నోట్లన్నీ వివిధ నగరాల్లో ఉన్న రిజర్వు బ్యాంకు శాఖలకు చేరిపోయాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ బ్యాంకులకు వాటిని తరలించారు. మైసూరులో ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు నోటు ముద్రణ్ లిమిటెడ్ సంస్థలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ నోట్లను ముద్రించారు. ఆ ప్రెస్కు ప్రత్యేకమైన రైల్వేలైను, నీళ్ల పైపులైన్ కూడా ఉన్నాయి. రెండు దశాబ్దాల నాటి ఈ ప్రపెస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రింటింగ్ ప్రెస్లలో ఒకటిగా పేరొందింది. ఇక్కడే ప్రత్యేకంగా కరెన్సీ ముద్రణకు కావల్సిన పేపర్ తయారీ విభాగం కూడా ఉంది.
ఆరు నెలల క్రితమే రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ మొదలైనా, ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ఒక్కో బ్యాంకుకు రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు వాటివాటి సామర్థ్యాన్ని బట్టి ఈ కొత్త నోట్లను పంపిణీ చేశారు. కేవలం డబ్బుల రవాణా కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు చార్టర్డ్ విమానాన్ని అద్దెకు తీసుకుంది. ఇందుకోసం ఈ విమానానికి రూ. 73.42 లక్షలు చెల్లించారు.