Mysuru-Kodagu MP
-
'అది నాకు మోదీ దయతో వేసిన భిక్ష'
సాక్షి, బెంగళూరు : తనకు ఎంపీ పదవి ప్రధాని నరేంద్రమోదీ వేసిన పెద్ద భిక్ష అని మైసూరు-కొడగు ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. తాను ఈరోజు ఇలా ఉన్నానంటే అంతా మోదీ దయే అని వ్యాఖ్యానించారు. మోదీ ఎవరికీ ఏంకావాలని అడిగినా దయతో ఇచ్చే ప్రధాన సేవకుడని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కర్ణాటక పర్యటనలో భాగంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతాప్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడం తప్ప మరొకటి కాదని కర్ణాటక ప్రభుత్వ న్యాయ సలహాదారు, అధికారిక ప్రతినిధి బ్రిజేష్ కలప్ప అన్నారు. 'ఈ మాటలు ఒక వ్యక్తి భజన చేయడం మాత్రమే కాదు.. ముమ్మాటికీ మేధావులైన, నాగరికులైన మైసూరు-కొడగు ప్రాంత పౌరులను అవమానించమే. ఆయన ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటే అది ఒక్క ప్రజలకు మాత్రమే చెప్పాలని, వారు మాత్రమే ఓట్లు వేశారు తప్ప మోదీ కాదు' అని మండిపడ్డారు. -
'ఆమెపై నా మాటలు తప్పే'
మైసూరు: గుండ్లుపేట నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గీతా మహాదేవప్రసాద్పై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను మైసూరు ఎంపీ ప్రతాపసింహ ఆదివారం వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమెను క్షమాపణ కూడా కోరడం జరిగింది. శనివారం బన్నితాళపురలో బీజేపీ అభ్యర్థి నిరంజన్కుమార్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ప్రతాపసింహ మాట్లాడుతూ భర్త చనియిన మూడు రోజులకే గీతా మహాదేవ ప్రసాద్ తానే అభ్యర్థిని అని ప్రకటించుకున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆదివారం ప్రతాపసింహ మైసూరులో మీడియా సమావేశం పెట్టి తన మాటలు గీత మహాదేవప్రసాద్కు ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని అన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఆ స్థానం ఇవ్వడం జరుగుతుందని, ఇలా అన్ని పార్టీలు చేస్తున్నాయని అన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, ఆమెను బాధపెట్టి ఉంటే క్షమించాలని, తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.