
సాక్షి, బెంగళూరు : తనకు ఎంపీ పదవి ప్రధాని నరేంద్రమోదీ వేసిన పెద్ద భిక్ష అని మైసూరు-కొడగు ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. తాను ఈరోజు ఇలా ఉన్నానంటే అంతా మోదీ దయే అని వ్యాఖ్యానించారు. మోదీ ఎవరికీ ఏంకావాలని అడిగినా దయతో ఇచ్చే ప్రధాన సేవకుడని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కర్ణాటక పర్యటనలో భాగంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతాప్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడం తప్ప మరొకటి కాదని కర్ణాటక ప్రభుత్వ న్యాయ సలహాదారు, అధికారిక ప్రతినిధి బ్రిజేష్ కలప్ప అన్నారు. 'ఈ మాటలు ఒక వ్యక్తి భజన చేయడం మాత్రమే కాదు.. ముమ్మాటికీ మేధావులైన, నాగరికులైన మైసూరు-కొడగు ప్రాంత పౌరులను అవమానించమే. ఆయన ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటే అది ఒక్క ప్రజలకు మాత్రమే చెప్పాలని, వారు మాత్రమే ఓట్లు వేశారు తప్ప మోదీ కాదు' అని మండిపడ్డారు.