చెప్పిందే చెబుతారేంటో!
టీవీ టైమ్
మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి. జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. భర్త, కాపురం, పిల్లల గురించి ఏవేవో ఊహించుకుంటుంది. అయితే దైవం మరొకటి తలుస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఓ బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తిని పెళ్లాడాల్సి వస్తుంది. అదే కష్టమనుకుంటే... అత్తారిల్లు అల్లకల్లోలంగా ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఉంటారు. ఒక్కో రకంగా ఆమెను హింసిస్తూ ఉంటారు.
ఇక చాలు చెప్పింది, ఈ కథ మాకు తెలుసులే అనబోతున్నారు కదూ! అవును మరి. ఇదే స్టోరీని చాలా సీరియళ్లలో చూశాం. అయినా కూడా మళ్లీ ఓ కొత్త సీరియల్‌గా ప్రసారమవుతోంది. అదే జెమినీ చానెల్లో వచ్చే ‘నా మొగుడు’ సీరియల్. చాలాసార్లు చూసిన, తెలిసిన పాత కథకి కొత్త హంగులు అద్ది, కొన్ని కొత్త రంగులు పులిమి తీసినట్టుగా ఉందా సీరియల్. కనీసం ముందు ముందు అయినా ఏవైనా కొత్త మలుపులు వస్తాయో లేక ఆ మలుపులు కూడా మరో పాత కథను గుర్తుకు తెస్తాయో చూడాలి!