షట్టర్ మూసితిరి.. తాళం మరిచితిరి!
బ్యాంక్ సిబ్బంది నిర్వాకం
స్థానికుల చొరవతో వెలుగులోకి...
నాచారం: బ్యాంక్ ఆఫ్ ఇండియా నాచారం శాఖ కార్యాలయంలోని ఓ షట్టర్‌కు తాళం వేయకుండా సిబ్బంది వెళ్లిపోయిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పక్కనే ఉన్న టెకీ మోటార్స్ నిర్వాహకుడు రాజశేఖర్ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇది గమనించి... స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాంక్ మేనేజర్ సుందరికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అయితే తాను సెలవులో ఉన్నానని... పొరపాటున సిబ్బంది తాళం వేయడం మరిచిపోయి ఉంటారని ఆమె సమాధానమిచ్చారు.
ఆ తర్వాత ఇన్చార్జి మేనేజర్ తేజస్విని, సెక్యూరిటీ గార్డు మూర్తితో కలసి రాత్రి 10.30 గంటల సమయంలో అక్కడికి వచ్చి తాళం వేశారు. బ్యాంక్ కార్యాలయానికి మూడు షట్టర్లు ఉంటే... రెండింటికి వేసిన సిబ్బంది... మరొక షట్టర్‌కు తాళం వేయడం మరిచిపోయారు. అక్కడే ఉన్న బీవోఐ ఏటీఎంకు సెక్యూరిటీ కూడా లేకపోవడం గమనార్హం.