జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక
20న ఓట్ల లెక్కింపు
- షెడ్యూలు విడుదల చేసిన ఈసీ
- ఈ ఎన్నిక ప్రక్రియ ముగిశాకే చట్ట సభల ఖాళీ స్థానాలకు ఎన్నిక: జైదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి కొత్త అధినేతను ఎన్నుకోవడానికి నగారా మోగింది. 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్నికల సంఘం(ఈసీ) బుధవారం షెడ్యూలు జారీ చేసింది. జూలై 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 14న నోటిఫికేషన్ జారీచేసి ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నసీం జైదీ బుధవారమిక్కడ ఎన్నికల కమిషనర్లు ఎ.కె.జోతి, ఓం ప్రకాష్ రావత్‌లతో కలసి విలేకరుల సమావేశంలో షెడ్యూలు విడుదల చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూలును త్వరలో జారీచేస్తామని తెలిపారు. లాభదాయక పదవిలో ఉన్నట్లు ఆరోపణలున్న 22 మంది ఆప్ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఓటేసేందుకు అర్హులేనన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలను రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిశాకే జరుపుతామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం 2017, జులై 24తో ముగియనుండడం తెలిసిందే.
ఎన్నికలు దగ్గరపడుతున్నా అధికార ఎన్డీయే, విపక్షం తమ అభ్యర్థుల ఎంపిక కోసం ఇంకా కసరత్తు చేస్తూనే ఉన్నాయి. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలెబట్టడానికి యత్నిస్తున్నాయి. కొద్ది రోజుల్లో ఎన్డీయే తన అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. రాష్ట్రపతి అభ్యర్థిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే నామినేషన్ల ఉపసంహరణకు గడువైన జూలై 1 నాటికి పలువురు బరిలో నిలుస్తారు. కాగా, సీఈసీ జైదీ వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల ఫలితాన్ని నోటిఫై చేసేనాటికి ఆయన పదవిలో ఉండరు.
సహాయ రిటర్నింగ్ అధికారులు వీరే..
ఆంధ్రప్రదేశ్: 1. కె.సత్యనారాయణ రావు, సెక్రటరీ(ఇన్చార్జి) స్టేట్ లెజిస్లేచర్ 2. పి.బాలకృష్ణమాచార్యులు, డిప్యూటీ సెక్రటరీ, స్టేట్ లెజిస్లేచర్
పోలింగ్ స్థలం: కమిటీ హాల్ నంబర్ 201, మొదటి అంతస్తు, అసెంబ్లీ భవనం, వెలగపూడి, గుంటూరు.
తెలంగాణ: 1. డాక్టర్ ఎస్. రాజా సదారాం, సెక్రటరీ, స్టేట్ లెజిస్లేచర్ 2. డాక్టర్ వి.నర్సింహాచార్యులు, సంయుక్త కార్యదర్శి, స్టేట్ లెజిస్లేచర్,
పోలింగ్ స్థలం: కమిటీ హాల్ నంబర్ 1, అసెంబ్లీ భవనం, పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్.
ఎన్నికల్లో ఎవరి బలమెంత?
ఎన్డీయేలోని మిత్రపక్షాలు, మద్దతునిస్తున్న ఇతర చిన్నాచితక పార్టీలతో కలుపుకొంటే అధికార బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో 48.64 శాతం ఓట్లున్నాయి. యూపీఏ, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే వీరికి 35.47 శాతం ఓట్లున్నాయి. మరో ఆరు ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, ఆప్, ఐఎన్ఎల్డీలు తమ రాష్ట్ర రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థే గెలిచే అవకాశమున్నపుడు మరో అభ్యర్థిని పెట్టడం ఎందుకని, రాష్ట్రపతి, స్పీకర్ లాంటి పదవులకు ఎన్నిక ఏకగ్రీవమవ్వాలని.. దీనిపై చర్చ జరగాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఎలక్టోరల్ ఓట్ల శాతం 1.53గా ఉంది. బీజేపీ శిబిరానికి ఇప్పుడున్న బలానికి (48.64 శాతం) వైఎస్సార్సీపీ కలిస్తే వారి అభ్యర్థికి 50.17 శాతం ఎలక్టోరల్ కాలేజీ మద్దతు ఉన్నట్లే. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిచ్చే అవకాశాలెక్కువ.
ఎన్నికల్లో ఎవరి బలమెంత?
నోటిఫికేషన్ 14.06.2017
నామినేషన్లకు గడువు 28.06.2017
నామినేషన్ల పరిశీలన 29.06.2017
అభ్యర్థిత్వాల ఉపసంహరణ గడువు 01.07.2017
పోలింగ్ 17.07.2017
ఓట్ల లెక్కింపు 20.07.2017
ఓటింగ్ ఇలా..ఎవరు ఎన్నుకుంటారు?
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎన్నికైన లోక్‌సభ సభ్యులు(543), ఎన్నికైన రాజ్యసభ సభ్యులు(233), ఎన్నికైన రాష్ట్ర శాసనసభల సభ్యులు(ఢిల్లీ, పుదుచ్చేరి సహా) ఉంటారు. మొత్తం 4,896 మంది ఓటేయడానికి అర్హులు. వీరిలో 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు. నామినేటెడ్ సభ్యులకు, రాష్ట్రాల శాసన మండళ్ల సభ్యులకు ఓటు హక్కు ఉండదు.
పోలింగ్ ఎలా..?
ఓటింగ్‌ను దామాషా ప్రాతినిధ్య విధానంలో రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తారు. కనుక పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఓటర్లు.. అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమంలో ఓటేస్తారు. అభ్యర్థుల పేర్ల ఎదురుగా 1, 2, 3... ఇలా అంకెలు రాస్తారు. ఓటు చెల్లాలంటే మొదటి ప్రాధాన్యత నమోదు తప్పనిసరి. ఇతర ప్రాధాన్యతల నమోదు ఐచ్ఛికం.
ఓట్ల లెక్కింపు ఎలా?
రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ను 50 మంది ఎలక్టోరల్ సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది ద్వితీయ ప్రతిపాదకులుగా ఉండాలి. అభ్యర్థి గెలవాలంటే మొత్తం ఓట్లలో 50 శాతం + 1 తొలి ప్రాధాన్యత ఓట్లు పొందాలి. ఏ అభ్యర్థికీ ఈ కోటా రాకపోతే.. తొలి ప్రాధాన్యత ఓట్లు అతి తక్కువగా వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగిస్తారు. ఆ అభ్యర్థికి వచ్చి తొలి ప్రాధాన్యత ఓట్లను.. ఆయా ఓట్లలో నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్ల ప్రకారం మిగిలిన అభ్యర్థులకు పంచుతారు. ఒక అభ్యర్థికి అవసరమైన కోటా లభించేదాకా ఇలా తక్కువ ప్రాధాన్యత ఓట్లు
వచ్చిన అభ్యర్థిని తొలగించి, సదరు ఓట్లను రెండో ప్రాధాన్యత ప్రకారం పంచుతారు. అప్పటికీ ఎవరికీ అవసరమైన కోటా రాకపోతే చివరికి పోటీలో మిగిలిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు.
ఓట్లకు విలువ ఇలా: ఎంపీల ఓట్లకు ఒక విలువ, ఎమ్మెల్యేల ఓట్లకు వేర్వేరు విలువలు ఉంటాయి. దేశాధినేత.. దేశ ప్రజలందరికీ దామాషా పద్ధతి ప్రకారం ప్రాతినిధ్యం వహించేలా, కేంద్ర, రాష్ట్రాలకు సమాన ఓటు హక్కు ఉండేలా ఈ సూత్రాన్ని పాటిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల ఓట్ల విలువను ఇలా లెక్కిస్తారు..
► ఒక ఎమ్మెల్యే ఓటు విలువ: 1971 జనాభా లెక్కల ప్రకారం ఆ రాష్ట్ర మొత్తం జనాభా / ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మొత్తం సభ్యుల సంఖ్య గీ 1000
► రాష్ట్ర శాసనసభ సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ: ఒక ఎమ్మెల్యే ఓటు విలువ గీ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య
► మొత్తం 31 రాష్ట్రాల్లోని (ఢిల్లీ పుదుచ్చేరి సహా) శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ: మొత్తం 31 రాష్ట్రాల్లోని అందరు ఎమ్మెల్యేల ఓట్ల విలువ మొత్తం = 5,49,474
► ఎంపీ ఓటు విలువ: అందరు ఎమ్మెల్యేల ఓట్ల మొత్తం విలువ (5,49,474) / మొత్తం
పార్లమెంటు సభ్యుల సంఖ్య (776) = 708
► అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ: ఒక ఎంపీ ఓటు విలువ గీ మొత్తం ఎంపీల సంఖ్య = 5,49,408
► ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మొత్తం విలువ: అందరు శాసనసభ్యుల ఓట్ల మొత్తం విలువ + అందరు ఎంపీల ఓట్ల మొత్తం విలువ = 5,49,474 + 5,49,408 = 10,98,882
నోట్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఈ విలువను ఇలాగే కొనసాగిస్తారా లేకపోతే తిరిగి లెక్కిస్తారా అన్నదానిపై ఈసీ నోటిఫికేషన్ వచ్చాక స్పష్టత వచ్చే అవకాశముంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్