ప్రతిపక్షమే లేని రాష్ట్రానికి కొత్త సీఎం
నాగాలాండ్‌లో అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) అధినేతగా ఉన్న షుర్హోజెలీ లీజియెట్సు కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలలో 42 మంది ఆయనకే మద్దతు పలకడంతో ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న జెలియాంగ్ నిర్ణయంపై ఒక్కసారిగా ప్రజాప్రతినిధులు తిరగబడ్డారు. వారి ఒత్తిడికి తలొగ్గిన ఆయన రాజీనామా చేయడంతో 81 ఏళ్ల లీజియెట్సు పగ్గాలు చేపట్టేందుకు ముందుకొచ్చారు. నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలుండగా.. వాటిలో 48 స్థానాలను నాగా పీపుల్స్ ఫ్రంట్ గెలుచుకుంది. మిగిలిన 12 స్థానాలు కూడా దాని మిత్రపక్షానికే రావడంతో.. అసలు అక్కడ ప్రతిపక్షం అన్నదే లేదు.
2015 సంవత్సరంలో కూడా ఒకసారి జెలియాంగ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, నాగాలాండ్ నుంచి ఉన్న ఏకైక ఎంపీ నెయిఫియు రియో అప్పట్లో ఈ ప్రయత్నం చేసి, తాను సీఎం అవ్వాలనుకున్నారు గానీ కుదరలేదు. ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం లీజియెట్సును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆయన కూడా ఎన్పీఎఫ్ నేతృత్వంలోని డెమొక్రాటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డాన్)కు నేతృత్వం వహించేందుకు అంగీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకుండా.. పరిపాలనను పునరుద్ధరించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.