జర్నలిస్టుల వల్లే ప్రజా సమస్యల పరిష్కారం
లేపాక్షి : సమాజంలో ప్రజా సమస్యలపై జర్నలిస్టుల పని తనం ప్రజా సమస్యల పరిష్కారానికి నిదర్శనమని, అహర్నిషలు ప్రజా శ్రేయస్సు కోసం శ్రమించే జర్నలిస్టుల సేవలు అభినందనీయమని తహశీల్దార్ ఆనందకుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లేపాక్షి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన జర్నలిస్టుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో శాసనం, కార్యనిర్వహణ, న్యాయశాఖలకు అనుసంధానంగా మీడియా రంగం పనిచేస్తుందన్నారు. మీడియా రంగానికి ఫోర్త్ స్టేట్‌గా గుర్తింపు ఉందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా మీడియా పనిచేస్తుందని చెప్పారు.
జర్నలిస్టులు ప్రజా సమస్యలపై సమాజాభివద్ధి కోసం పని చేయడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి తమ పరిధిలో శక్తివంచన లేకుండా సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, డాక్టర్ శ్రీదేవి, ఎంఈఓ నాగరాజునాయక్ , సీనియర్ జర్నలిస్టులు మల్లికార్జున, ఆనందప్ప, సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్లు ఇంటి స్థలం, ప్రెస్‌క్లబ్ ఏర్పాటుకు లేపాక్షిలో 5 సెంట్లు స్థలం కేటాయించాలని కోరారు. అనంతరం జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సురేంద్రనాయక్, ఏపీఓ లక్ష్మిభాయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మురళీ, జర్నలిస్టులు గోవర్దన్‌బాబు, సురేంద్రరెడ్డి, అశోక్, సందీప్, శశాంక్, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.