నగరి మున్సిపాలిటీ రద్దు సంగతేంటి?
హామీలు మరచిన ముద్దుకృష్ణమనాయుడు
ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారం
జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకెక్కడిది?
ఎమ్మెల్యే ‘గాలి’ తీరుపైఆర్.కె.రోజా ధ్వజం
పుత్తూరు, న్యూస్‌లైన్:
ఓట్లు, సీటు కోసం ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎంతటి స్థాయికైనా దిగజారుతారనేందుకు నగరి మున్సిపాలిటీని రద్దు చేయిస్తానని ఇచ్చిన హామీనే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, నగరి నియోజకవర్గ సమన్వయక కర్త ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తనది 35 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న ముద్దుకృష్ణమ నాయుడు పుత్తూరు, నగరి మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చుకున్నారని గుర్తు చేశారు.
టీడీపీలో నగరి నియోజకవర్గం టికెట్టు పొంది, ఓట్ల కోసం నగరి మున్సిపాలిటీని రద్దు చేయిస్తానని, నేతన్నలు పెరిగిన విద్యుత్ చార్జీలను చెల్లించవద్దని, వాటిని రద్దు చేయిస్తానని ప్రలోభపెట్టారన్నారు. ఆయన స్వల్ప ఓట్లతో గట్టెక్కితే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఈ సాకు చూపించి ఐదేళ్ల కాలాన్ని గడిపేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలకు కొత్త కథను రూపొందించి మహానేత వైఎస్ఆర్పై, ఆయన తనయుడు జగన్‌పై విమర్శనాస్త్రాలను చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆయన కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయించుకుని అపరభగీరథుడు అంటూ పొగడ్తలు కురిపించారన్నారు.
నేడు మహానేతపై చేస్తున్న బురదజల్లే రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పుత్తూరులో ఓవర్‌బ్రిడ్జ్, సమ్మర్‌స్టోరేజీ, అండర్‌బ్రిడ్జ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మంజూరు చేయించుకుని తన అనుచరులకు కాంట్రాక్ట్‌లు అప్పగించుకోలేదా ? అని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో జననేత జగన్ నాలుగు రోజుల పర్యటనకు అపూర్వ స్పందన లభించిందన్నారు. దీన్ని ఓర్వలేని ముద్దుకృష్ణమ నాయుడు ఓటమి భయంతో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కోటల్లో సైతం జగన్‌కు జనం అపూర్వ స్వాగతం పలికారన్నారు. దీంతో ముద్దుకృష్ణమ నాయుడుకు మతిభ్రమించి స్థాయి మరచి మరింత దిగజారిపోయి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.