సౌదీలో నగర్తండా వాసి మృతి
లోకేశ్వరం : మండలంలోని నగర్తండాకు చెందిన రాథోడ్ గణేశ్(32) సౌదీ అరేబియాలో మృతి చెందాడు. విషయాన్ని గురువారం లోకేశ్వరం తహసీల్దార్ లోకేశ్వర్రావు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంబసీ సమాచారం మేరకు నగర్తండాకు వెళ్లి గణేశ్ మృతి విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మూడు నెలలుగా గణేశ్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం అతడి మరణ వార్త తెలిసింది. మృతుడికి భార్య నీలాబాయి, కుమారుడు సురేశ్, కూతురు గౌరి ఉన్నారు. శుక్రవారం కుటుంబానికి సంబంధించిన పూర్తి నివేదికలను తయారు చేసి వీలైనంత త్వరగా గణేశ్ మృతదేహాన్ని తెప్పించే ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్ తెలిపారు.