జిల్లాలో రూ.240 కోట్ల విద్యుత్ బకాయిలు
అనుమసముద్రంపేట, న్యూస్‌లైన్: జిల్లాలో రూ.240 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని ట్రాన్స్‌కో ఎస్ఈ నాగశయనరావు తెలిపారు. సోమవారం ఆయన ఏఎస్‌పేటలోని 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వరంగంలో రూ.190 కోట్లు, ప్రైవేట్ సంస్థలు, కాలనీలు, గృహాలకు సంబంధించిన రూ.50 కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఎస్సీ, ఎస్టీకాలనీల్లోని దళితులు వారి కులం సర్టిఫికెట్లను ఇవ్వాలని కోరారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే 50 యూనిట్ల రాయతీ వారికి వర్తిస్తుందని తెలిపారు
. రైతులు ఏడు గంటల పాటు విద్యుత్ అందజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అందుకుగానూ ప్రతి బుధవారం ఫ్యాక్టరీలకు పవర్ హాలిడే ఇస్తున్నామన్నారు. జిల్లాకు 11 మిలియన్ యూనిట్ల అవసరం ఉందని, 9.48 మిలియన్ యూనిట్ల మాత్రమే అందుతుందన్నారు. దీంతో కోతలు అనివార్యమయ్యాయన్నారు. ఏఎస్‌పేటలోని దర్గాకు ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు వస్తుంటారని, విద్యుత్ కోతలతో నీటికి ఇబ్బందులు పడతారని, శుక్రవారం విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్థానికులు ఆయన దృష్టికి తేవడంతో అందుకు ఆయన స్పందించారు. నీటి కొరత లేకుండా అదనంగా విద్యుత్ ఇవ్వాలని డీఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఈ ఆదిశేషయ్య, ఏడీఈ బాలాజీ, ఏఈ గుమ్మా శ్రీనివాసులు, లైన్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు.