ఐఐటీలో అదరగొట్టారు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థుల జయకేతనం
♦ ఆలిండియా టాప్ టెన్‌లో ఐదు ర్యాంకులు మనవే
♦ తెలంగాణ, ఏపీ నుంచి 2,938 మంది అర్హులు
♦ ఏపీ నుంచి 2,155 మంది, తెలంగాణ నుంచి 783 మంది
♦ అత్యధికంగా 15,311 మంది సీబీఎస్ఈ విద్యార్థుల ఎంపిక
♦ మొత్తం అర్హులు 26,456 మంది
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. దేశవ్యాప్తంగా 1,24,741 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 1,17,238 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 26,456 మంది అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే 2,938 మంది విద్యార్థులు ఉన్నారు. జాతీయ స్థాయిలో టాప్-10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను కూడా తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు.
గత నెల 24న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పూర్తిస్థాయి ఫలితాలను ఐఐటీ బాంబే గురువారం ప్రకటించింది. ఇందులో అర్హత సాధించిన వారిలో అత్యధికంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) బోర్డుకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ఇక తెలుగు విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. ఇందులోనూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 2,155 మంది ఉండగా, తెలంగాణ నుంచి 783 మంది ఉన్నారు. అయితే టాప్ ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలంగాణ బోర్డు నుంచే ఇంటర్మీడియెట్ చదివిన వారు కావడం విశేషం. మొత్తానికి టాప్-500 ర్యాంకుల్లో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉన్నారు. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థులంతా బాలురే. టాప్-50 ర్యాంకుల్లో ఒకే ఒక్క బాలిక ఉంది. ఏఏటీ రిజిస్ట్రేషన్‌కు నేటి వరకే గడువు
ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును(ఏఏటీ) ఈ నెల 21 నిర్వహించేందుకు ఐఐటీ బాంబే షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది. ఇందుకోసం విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాసు, రూర్కీ ఐఐటీల్లోనే నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యే వారు జేఈఈ అడ్వాన్స్డ్ ఒరిజినల్ హాల్‌టికెట్(అడ్మిట్ కార్డు)ను వెంట తీసుకెళ్లాలి. విద్యార్థులు ఉదయం 8:30 గంటలకల్లా పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలి. ఆలస్యమైతే పరీక్షకు అనుమతించరు.
అనారోగ్యాన్ని లెక్క చేయలేదు
పరీక్షకు నెలరోజుల ముందు తీవ్రమై న జ్వరంతో బాధపడ్డాను. ఏమాత్రం అధైర్యపడకుండా పరీక్షకు హాజరయ్యా. ఆల్ ఇండియా 4వర్యాంకు రావడం గర్వంగా ఉంది. విజయం టీచర్ల ప్రోత్సాహం, తల్లిదండ్రుల దీవెనలు ఉన్నాయి.
- నాగేంద్రరెడ్డి, ఆలిండియా4 వ ర్యాంక్
అందరి ప్రోత్సాహం వల్లే
మాది కడప జిల్లా రాయచోటి. 504 మార్కులకు 424 వచ్చాయి. పటిష్టమైన ప్రణాళిక, అంకిత భావం, మంచి శిక్షణ నా విజయ రహస్యాలు. ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను.
- కె.విష్ణువర్దన్‌రెడ్డి, ఆల్ ఇండియా 9వ ర్యాంక్
మామయ్యే స్ఫూర్తి
మాది గుడివాడ. నాకు తొలి గురువు మామయ్య విజయప్రకాష్. ఆయన స్ఫూర్తితోనే కష్టపడి చదివాను. ఆల్ ఇండియాలో 39వ ర్యాంకు(ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్) సాధించాను. ముంబై ఐఐటీలో సీఎస్సీ కోర్సులో చేరుతాను.
- టి.భవన్, ఆల్ఇండియా 39వ ర్యాంక్
నమ్మలేక పోతున్నా
నాకు 61వ ర్యాంకు వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నా. ఈ విజయాన్ని నా గురువులకు అంకితమిస్తున్నా. ఆసక్తితో చదివితే ఏదైనా సాధ్యమే. నా విజయానికి కారణమైన నా తల్లిదండ్రులకు, గురువులకు కృతజ్ఞతలు.
- అఖిల్, ఆల్ ఇండియా 61వ ర్యాంక్
చాలా ఆనందంగా ఉంది
ఆల్ ఇండియా స్థాయిలో వందో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులకు, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన గురువులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నా.
- కార్తీకేయ శర్మ, ఆల్ ఇండియా వందో ర్యాంకు