Nagireddi
-
వంచించిన ప్రేమికునికే పోలీసుల వత్తాసు!
మలికిపురం, న్యూస్‌లైన్ : ప్రేమిస్తున్నానన్న తియ్యనిమాటలతో నమ్మించి, కమ్మనికలల్లో తేలియాడించిన వాడే ఇప్పుడు దిగమింగుకోలేని చేదును చవి చూపిస్తున్నాడని ఆ యువతి వాపోతోంది. ‘బాధితుల రక్షణే ధ్యేయం’ అనే పోలీసులు..బాధితురాలైన తనకు న్యాయం చేయడం మాని తనను బాధించిన వాడికి బాసటగా నిలిచారని ఘోషిస్తోంది. ఆరునెలలుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం ఇంకెప్పుడు జరుగుతుందని ఆక్రోశిస్తోంది. ఆ యువతి పేరు చలమలశెట్టి దుర్గాభవాని. వయసు 20 ఏళ్లు. ఊరు మలికిపురం మండలం లక్కవరం. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ యువతి ఆరేళ్ల క్రితం కుట్టుపని నేర్చుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉందామనుకుంది. ఆ పని నేర్చుకోవడానికి వెళ్లే సమయంలో అదే ఊరికి చెందిన నాగిరెడ్డి సోమరాజు అనే యువకుడు ఆమె వెంటపడ్డాడు. ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళుతున్నప్పుడు కూడా భవానిని పెళ్లి చేసుకుంటాననే చెప్పాడు. తాను తిరిగి వచ్చే నాటికి ఆమెకు మైనారిటీ తీరుతుంది గనుక పెళ్లికి అడ్డంకి ఉండదన్నాడు. ఆ మాటలు నిజమని నమ్మిన భవాని సోమరాజు తిరిగి వచ్చే రోజు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూసింది. ఆరునెలల క్రితం లక్కవరం వచ్చిన సోమరాజు పెళ్లి సంగతి ప్రస్తావిస్తే ముఖం చాటేశాడు. దీంతో భవాని విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లింది. భవానిని పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో చెప్పిన సోమరాజు ఆనక పరారయ్యాడు. దీంతో భవాని అప్పుడే మలికిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచీ న్యాయం చేయమని పోలీసుస్టేషన్‌కు వచ్చి ప్రాధేయపడుతూనే ఉంది. అయితే వారు ‘అదిగో.. ఇదిగో’ అంటూ కాలం వెళ్లదీశారే తప్ప సోమరాజు ఆచూకీ కనిపెట్టలేదు. తీరా చూస్తే సోమరాజు తిరిగి గల్ఫ్ వెళ్లిపోయాడని తేలింది. సోమరాజు పెద్దల ప్రలోభాలకు లొంగి కావాలనే పోలీసులు తాత్సారం చేశారని భవాని ఆరోపిస్తోంది. కూలి పనితో కుటుంబాన్ని పోషించే ఆమె తండ్రి నాగేశ్వరరావు బిడ్డ భవిష్యత్తు ఏమిటని కుమిలిపోతున్నాడు. ప్రేమించిన వాడు పెళ్లాడతానని నమ్మించి మోసగించాడని, న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా అతడికే కొమ్ము కాసి తనకు అన్యాయం చేశారని భవాని ఆరోపిస్తోంది. గత ఆరు నెలలుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్న తనకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతోంది. -
నదీజలాల హక్కులపై తెరాస వ్యాఖ్యలు : నాగిరెడ్డి
నందిగామ, న్యూస్‌లైన్ : నదుల దిగువ ప్రాంతాలవారికి నదీజలాలపై ఎటువంటి హక్కులూ ఉండవని టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతూ మార్గ మధ్యంలో నందిగామ రహదారి బంగ్లాలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన వల్ల రెండు ప్రాంతాలకు వినాశనమేనన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే అన్ని ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతిని, ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అన్న పేరు పోతుందన్నారు. 1న సమైక్య రైతు శంఖారావం అక్టోబరు ఒకటిన విజయవాడ ప్రకాశం బ్యారేజీపై ట్రాక్టర్లతో సహా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులతో ‘సమైక్య రైతు శంఖారావం’ నిర్వహిస్తున్నట్లు నాగిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మల్లో ఒకరు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. రెండు జిల్లాల్లోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైఎస్ ముమ్మాటికీ సమైక్యవాదే దివంగత నేత వైఎస్సార్ ఎప్పుడూ విభజనవాదాన్ని సమర్ధించలేదన్నారు. 2004 ఎన్నికల సమయంలోనూ రెండో ఎస్సార్సీ ద్వారా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవాలని అధిష్టానానికి సూచించారని, అదే విషయాన్ని అప్పటి ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చారన్నారు. వేర్పాటువాదాన్ని తనదైన శైలిలో అడ్డుకున్న వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని ప్రతి ఒక్కరి మనస్సులో ఉందన్నారు. తన హయాంలో విభజనకై తొమ్మిది అంశాలతో ప్రత్యేకంగా జీఓ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయ ఇన్చార్జి మొండితోక అరుణ్, మండల కన్వీనర్లు కుక్కల సత్యనారాయణ ప్రసాద్ (నందిగామ), తాటి రామకృష్ణ (పట్టణ), బండి కోటేశ్వరరావు (కంచికచర్ల), దాసరి రాము (కంచికచర్ల పట్టణ), కోట బుచ్చయ్య చౌదరి (చందర్లపాడు), జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి, పీజెవీఎస్ కుమార్, ముక్కపాటి శివాజీ, పలు విభాగాల కన్వీనర్లు బుచ్చిరెడ్డి, పాములపాటి రామకృష్ణ, కామసాని ఉదయకుమార్, అనుముల చుక్కయ్య, మువ్వల శ్రీనివాసరావు, రబ్బానీ, సుభానీ, సుఖదేవ్ తదితరులు పాల్గొన్నారు.