Nagireddipeta
-
వైరల్: మీరేనా.. మేమూ షికారు చేస్తాం!
మీరే కాదు మేము కూడా షికారు చేయగలమంటున్నాయి వానరాలు! నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం రెండు కోతులు వాహనాలెక్కి ఫోజులు కొట్టాయి. ఓ వానరం బైక్ అద్దంలో చూసుకుని హొయలు పోగా, మరో కోతి ఆటో టాప్‌పైన ఠీవీగా కూర్చుంది. ఈ రెండు చిత్రాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – నాగిరెడ్డిపేట -
అంగన్‘వేడీ’ల విలవిల
నాగిరెడ్డిపేట/లింగంపేట (ఎల్లారెడ్డి):అంగన్వాడీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఎండల తీవ్రతకు ఎవరూ రాకపోవడంతో బోసిపోతున్నాయి. ఫలితంగా కొన్ని రోజులుగా అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం భారీగా పడిపోయింది. కొన్ని కేంద్రాల్లో సగానికి తక్కువగా, మరికొన్ని కేంద్రాల్లోనైతే ఒకరిద్దరు చిన్నారుల మాత్రమే హాజరవుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకొర వసతులు కలిగిన భవనాలతో పాటు ఇరుకైన అద్దె గదుల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా చిన్నారులను కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇక మండుటెండల్లో గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతూ కేంద్రాలకు వస్తున్నారు. కానీ వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సగం మంది రావట్లేదు.. జిల్లాలోని 1,038 అంగన్వాడీ కేంద్రాలు, 155 మినీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో 55,137 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే, ప్రస్తుతం సగటున రోజుకు 25 వేల మంది చిన్నారులు కూడా కేంద్రాలకు హాజరు కాకపోవడం గమనార్హం. హాజరు శాతం పడిపోవడానికి దంచికొడుతున్న ఎండలే ప్రధాన కారణం. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో చిన్నారులు కేంద్రాలకు రావడం లేదు. వారిని పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. వాస్తవానికి కేంద్రాల్లో చదివే పిల్లల వయస్సు 3 నుంచి 5 సంవత్సరాల లోపే. వీరు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలను తట్టుకొని కేంద్రాలకు రాగలరా.. వచ్చినా కేంద్రాల్లో ఉక్కపోతకు ఉండగలరా? అనే భావనతో తల్లిదండ్రులు చిన్నారులను పంపించడం లేదు. వేసవి సెలవులు లేవు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసవిలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నడుపుతున్నట్లు జిల్లా ఐసీడీఎస్ పీడీ రాధమ్మ తెలిపారు. కానీ, ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. మరోవైపు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం చిన్నారులకు సెలవులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంగన్వాడీ టీచర్లకు నేటి నుంచి ఈ నెల 17 వరకు, ఆయాలకు 18 నుంచి 31 వరకు సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన సర్కారు.. అంగన్వాడీలకు మాత్రం వేసవి సెలవులు ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
తమ మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని ...
మెదక్‌కు తరలివచ్చిన నాగిరెడ్డిపేట మండల వాసులు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత స్వాగతం పలికిన స్థానిక టీఆర్ఎస్ నాయకులు మెదక్ మున్సిపాలిటీ:కూతవేటు దూరంలో ఉన్న తమ మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు పలు వాహనాల్లో మెదక్ పట్టణానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డితోపాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డిపేట మండల ప్రజలకు ఎదురుగా వెళ్లి పూలదండలు వేసి స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ఆర్డీఓ కార్యాలయం బైఠాయించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట మండల రైతు నాయకులు నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు జయరాజ్‌లు మాట్లాడుతూ.. తమ మండలం మెదక్ పట్టణానికి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. తమ ప్రాంత నాయకులు రాజకీయ స్వలాభం కోసం 60 కిలో మీటర్ల దూరంలో గల కామారెడ్డిలో మండలాన్ని కలుపుతున్నారని మండిపడ్డారు. మండల ప్రజలు ఏ అవసరానికైనా మెదక్‌కు వస్తారని తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండలానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి, మహేష్, సంగయ్య తదితరులు పాల్గొన్నారు. ------------------ 02ఎండికె04ఏ: ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేస్తున్న నాగిరెడ్డిపేట వాసులు -
భారీగా నగదు పట్టివేత
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్: వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరు గేట్ సమీపంలో ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శ్రీనివాస్, అనిల్ రూ. 2.89 లక్షల నగదును పట్టుకున్నారు. సిద్దిపేటకు చెందిన దేశభక్తి శివ అనేవ్యక్తి తన వాహ నంలో ఎల్లారెడ్డి నుంచి మెదక్ వెళ్తుండగా అధికారులు శివ వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వ్యాన్‌లో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. కోడిగుడ్లను విక్రయించగా వచ్చిన డబ్బును వ్యాన్‌లో తీసుకు వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారని బాధితుడు శివ తెలిపారు. రూ. 2.17 లక్షలు బాల్కొండ: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా మండలంలోని చాకీర్యాల్ చెక్‌పోస్ట్ వద్ద వివిధ వాహనాల తనిఖీల్లో 2.17 లక్షల నగదును శనివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రూ. 2 లక్షల 45 వేలు సదాశివనగర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలవద్ద 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఫ్లయిం గ్ స్వ్కాడ్ బృందం వాహనాలను తనిఖీ చేసి రూ. 2 లక్షల 45వేల నగదును పట్టుకున్నారు. ఎంహెచ్ 40వై 5242 నం బరు గల మహరాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సులో రూ. 95 వేలు తరలిస్తున్న ఆసమహ్మద్ వద్ద డబ్బుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అలాగే టర్బో వాహనంలో రూ. లక్షా 50వేలు తరలిస్తున్న మహ్మద్ ఉస్మాన్ నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బును జిల్లా ఖజానాకు పంపిస్తున్నట్లు బృందం ప్రతినిధులు ప్రేమ్‌కుమార్, ఏఎస్సై జేవీఆర్ నర్సయ్య, సిబ్బంది తెలిపారు. సాలూర చెక్ పోస్టు వద్ద రూ.1.60 లక్షలు బోధన్ టౌన్: మండల శివారులోని అంధ్ర- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలుర చెక్ పోస్టు వద్ద ఆదివారం పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ. 1.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు బోధన్ సీఐ రామకృష్ణ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి బోధన్ వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ తనిఖీ చేయగా ఇద్దరి వ్యక్తుల వద్ద రూ. 1.60 వేలు ఉన్నాయని, వారివద్ద నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
అక్కాతమ్ముడి ఆత్మహత్యాయత్నం
లింగంపేట,న్యూస్‌లైన్ : మండలంలోని ఐలాపూర్‌లో బుధవారం అక్కాతమ్ముడు విషం సేవించి ఆత్మహత్యకు యత్నించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్సై రాకేశ్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన మల్లయ్యల పోచయ్య, ఆయన అక్క మానెవ్వ కుటుంబ సమస్యలు, మానసిక వ్యధతో ఆత్మహత్యకు యత్నించారు. పోచయ్య భార్య నర్సవ్వ కొంతకాలంగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచూ భర్తతో గొడవ పడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసేది. ఈక్రమంలో పోచయ్య ఇటీవల భార్యతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాడు. రూ.50 వేలు భార్యకు అందించాడు. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న మానెవ్వ, పోచయ్యలు ఆత్మహత్యకు యత్నించారని ఎస్సై తెలిపారు. స్థానికుల సమాచారంతో ఇద్దరిని 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని చెప్పారు. నాగిరెడ్డిపేటలో వివాహిత.. నాగిరెడ్డిపేట : మండలకేంద్రానికి చెందిన చిరుకొండ సవిత(23) బుధవారం తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. సవిత తన అత్త అంజవ్వతో వ్యవసాయభూమి విషయమై గొడవపడ్డారు. ఈక్రమంలోనే ఆము ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై చల్లుకోని నిప్పంటించుకుంది. స్థానికులు వెంటనే మంటలు ఆర్పివేసి, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సవిత భర్త ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ :నాగిరెడ్డిపేట మండల పంచాయతీరాజ్ ఇన్చార్జి ఏఈ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. చీనూర్ పంచాయితీ పరిధిలోని మేజర్‌వాడి ప్రాథమికొన్నత పాఠశాల ఆవరణలో మూడుమాసాల క్రితం రూ. 75వేలతో వంటగది నిర్మించారు. ఇందుకు సంబంధించి ఎంబీ రికార్డు చేసేందుకు శ్రీనివాస్ మూడునెలలుగా కాంట్రాక్టరైన టీఆర్ఎస్పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గంపల యాదగిరిని కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నాడు. చివరికి ఎంబీ రికార్డు చేసేం దుకు రూ. 15 వేలు డిమాండ్ చేశారు. అంతపెద్ద మొత్తం తాను ఇచ్చుకోలేనని యాదగిరి పేర్కొనగా చివరికి రూ. 10 వేలకు బేరం కుదిరింది. అనంతరం యాదగిరి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మం డల పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్లో యాదగిరి నుంచి రూ. 10వేలు తీసుకుంటుండగా ఏఈ శ్రీనివాస్‌ను అక్కడ మాటువేసిఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కార్యాలయంలోని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నా రు. నిందితుడిని హైద్రాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీయస్సీ సంజీవరావు తెలిపారు. ఇన్చార్జి ఏఈగా శ్రీనివాస్ రెండున్నరేళ్లుగా మం డలంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనఎల్లారెడ్డి పీఆర్ ఏఈగా రెగ్యులర్ పోస్టులో కొనసాగుతున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే బాధితులు తమను సంప్రదించాలని డీయస్పీ సంజీవరావు విలేకరులతో మాట్లాడుతూ కోరారు. సెల్ నం. 9440446155 కు ఫోన్ చేయాలని సూచించారు. ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఖుర్షిద్ పాల్గొన్నారు. ఏసీబీ దాడులు మండలంలో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ అధికారి ఇలా దొరికిపోవడం ఈ ప్రాంతంలో మొదటి సారిగా స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకుని పలుగ్రామాల నుంచి నాయకులు, ప్రజలు మండల పరిషత్ కాార్యాలయానికి తరలివచ్చారు. అవినీతి అధికారుల్లో మాత్రం గుండె దడ మొదలైంది.