అదుపు తప్పిన లారీ.. రోడ్డు పాలైన సిమెంట్..!
చాపాడు: ప్రొద్దుటూరు–మైదుకూరు రహదారిలో మండలంలోని నాగులపల్లె సమీపంలో శనివారం ఉదయం ఓ లారీ అదుపు తప్పిన కారణంగా రూ. లక్షలు విలువ చేసే సిమెంటు రోడ్డు పాలయింది. ప్రొద్దుటూరు నుంచి ఏపీ29ఏయూ9909 నెంబరు గల సిమెంటు లారీ మైదుకూరు వస్తుండగా, నాగులపల్లె సమీపంలో అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. దీంతో లారీ బోల్తా పడింది. దీని కారణంగా లారీలోని సిమెంటు బస్తాలన్నీ రోడ్డుపై పడ్డాయి. అనంతరం క్రేను సాయంతో బోల్తాపడిన లారీని తొలగించగా, వేరే లారీలోకి సిమెంటును ఎత్తుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ ప్రమాదం కారణంగా ఒన్ వే రాకపోకలు జరపాల్సి రావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.