బాత్రూంలో చిరుత దూరింది!
వాళ్లకు కొత్తగా పెళ్లయింది. ఏదైనా మంచి ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని హనీమూన్ స్పాట్‌గా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ను ఎంచుకున్నారు. అక్కడ ఉన్నవాటిలో మంచి హోటల్ ఒకదాంట్లో గది బుక్ చేసుకున్నారు. తెల్లవారుజామున పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అని చూస్తే.. బాత్రూంలో చిరుతపులి దూరింది! అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఒకవైపు చిరుతపులిని చూసి ఆ కొత్తజంట భయపడితే, మరోవైపు చిరుతపులి కూడా ఎందుకో తెలియదు గానీ, బాత్రూంలో భయం భయంగా ఓ మూల నక్కి కూర్చుంది. తెల్లవారుజామున 4.45 సమయంలో అద్దం పగిలిన శబ్దానికి తాను లేచానని, చూస్తే కిటికీలోంచి చిరుతపులి లోపలకు దూరిందని.. దాంతో వెంటనే తాను, తన భార్య దుప్పటి కప్పేసుకుని దాక్కున్నామని.. చిరుతపులి నేరుగా వెళ్లి బాత్రూంలో దాక్కుందని సుమిత్ అనే సదరు భర్త చెప్పాడు. వెంటనే తాను వెళ్లి బాత్రూం తలుపు గడియ పెట్టి హోట్ యాజమన్యానికి విషయం చెప్పానన్నాడు.
హోటల్ యజమాని అమిత్ సా వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లతో పాటు అటవీ శాఖాధికారులు కూడా వచ్చారు. వాళ్లు వల, మత్తు ఇంజెక్షన్లు తీసుకుని వచ్చినా.. చిరుతపులి మాత్రం ఎలాగోలా పారిపోయింది. కుక్కలు తరమడంతో అది ఇటువైపు వచ్చి ఉంటుందని, తాము ప్రయత్నించినా పారిపోయిందని నైనిటాల్ డీఎఫ్ఓ తేజస్విని అరవింద్ పాటిల్ చెప్పారు. దాని వయసు సుమారు ఏడాది ఉంటుందని, అడవిలో అయితే సురక్షితంగా ఉంటుందని అక్కడికే వెళ్లిపోయినట్లుందని ఆమె తెలిపారు.
భలే దగ్గరగా చూశా
చిరుతపులిని చూసి కాస్త భయపడిన మాట నిజమే అయినా.. తర్వాత మాత్రం దాన్ని అంత దగ్గర నుంచి చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని సుమిత్ భార్య శివాని చెప్పారు. కిటికీకి అద్దం తప్ప వేరే గ్రిల్ ఏమీ లేదని, అందువల్లే అది లోనికి రాగలిగిందని సుమిత్ అన్నారు. హరినగర్ ప్రాంతంలోని మసీదువైపు నుంచి చాలా వీధికుక్కలు తరుముకుంటూ వస్తుండగా చిరుతపులి హోటల్లోకి దూరడాన్ని తాను చూశానని అదే హోటల్లో బసచేస్తున్న మరో అతిథి రాజేష్ సిజ్వాలి చప్పారు.