ఈ శ్మశానాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు!
నజాఫ్: అక్కడ నిలబడి ఏ దిక్కుకు చూసినా కనుచూపు మేరలో సమాధులే కనిపిస్తాయి. ఇప్పటికే 50 లక్షల మందిని సమాధి చేశారక్కడ. ఏటా కొత్తగా 5 లక్షల సమాధులు నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద శ్మశానంగా రికార్డులకెక్కిన ఈ వదీ అల్ సలామ్(శాంతి లోయ) ఇరాక్ రాజధాని బాగ్ధాద్ కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని నజాఫ్ పట్టణంలో ఉంది.
షియా ముస్లింల మూడో అతిపెద్ద పవిత్ర నగరంగా భాసిల్లిన నజాఫ్.. ప్రస్తుతం ఐసిస్ (సున్నీ) ఉగ్రవాదుల చేతుల్లోపడి కకావికలమైంది. నగరాన్ని ధ్వంసం చేసిన ఉగ్రమూకలు శ్మశానాన్ని మాత్రం వదిలేశారు. షియాల మొదటి మతగురువు, నాలుగో ఖలీఫా అయిన అలీ ఇబిన్ అబి తాలిబ్ ను నజాఫ్ లోనే ఖననం చేశారు. అందుకే ఈ ప్రదేశాన్ని షియాలు పవిత్ర లోయగా భావిస్తారు. మత గురువు సమాధికి సమీపంగా నిర్మితమైన ఈ శ్మశానంలో క్రీస్తు శకం 600 సంవత్సరం నాటి సమాధులు కూడా ఉండేవి. కాలక్రమంలో కొత్త సమాధులు భారీగా నిర్మించుకుంటూ పోవడంతో పాతవి కొన్ని ధ్వంసం అయ్యాయి. అయినా కూడా ఇప్పుడు సమాధుల సఖ్య 50 లక్షలకు పైనే!