నజీబ్ జంగ్ రాజీనామా
హఠాత్తుగా ప్రకటించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
► సీఎం కేజ్రీవాల్ ఆశ్చర్యం
► వేడెక్కిన ఢిల్లీ రాజకీయాలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వంతో నిరంతరం వివాదాల్లో నలుగుతున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ గురువారం హఠాత్తుగా రాజీనామా చేశారు. నాటకీయ పరిణామాల మధ్య ఈ రాజీనామా జరగటం ఢిల్లీతోపాటు దేశ రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. అయితే.. ‘కేంద్రానికి రాజీనామా సమర్పించాను. నాకు ఇష్టమైన విద్యారంగం వైపు వెళ్లాలనుకుంటున్నాను’ అని నజీబ్ జంగ్ మీడియాకు పంపిన సంక్షిప్త సందేశంలో పేర్కొన్నారు. తనకు సహకరించిన ప్రధాని మోదీకి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జంగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిపాటు రాష్ట్రపతి పాలన సందర్భంగా హస్తిన ప్రజలు అందించిన తోడ్పాటు మరవలేనన్నారు. కాగా, జంగ్ రాజీనామాపై కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలసిపోయినందువల్లే రాజీనామా చేసినట్లు నజీబ్ తెలిపారని డిప్యూటీ సీఎం సిసోడియా అన్నారు. బీజేపీ మాత్రం ఆప్ సర్కారుపై అసంతృప్తితోనే నజీబ్ రాజీనామా చేశారని ఆరోపించింది.
బుధవారం ఆయన్ను కలిసినప్పుడు కూడా ఆప్ సర్కారు వ్యవహారంతో కలత చెందినట్లు చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా వ్యాఖ్యానించారు. అటు కాంగ్రెస్ మాత్రం ‘ఆరెస్సెస్ వ్యక్తిని ఎల్జీగా నియమించేందుకే జంగ్ తప్పించారా?’ అని ప్రశ్నిం చింది. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆప్ ప్రభుత్వంతో వివాదాల వల్ల జంగ్ రాజీనామా చేయలేదని, దీనిపై కొన్ని నెలలుగా యోచిస్తున్నారని జంగ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండ్రోజుల క్రితం కలిసినపుడే జంగ్ రాజీనామా గురించి సంకేతాలిచ్చారని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి తెలిపారు.
‘ఆప్’తో నిరంతర సంఘర్షణ
2015లో ఆప్ రెండోసారి పగ్గాలు చేపట్టినపుడు ప్రభుత్వం, ఎల్జీ మధ్య ఘర్షణ మొదలైంది. జంగ్.. ప్రధాని కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ఉప రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపణలు గుప్పించింది. వీరి వివాదాలు సుప్రీం కోర్టు వరకూ వెళ్లాయి. ఢిల్లీలో పాలనాధికారాలు ఎల్జీకే చెందుతాయని ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తీర్పునివ్వడంతో వివాదం తారస్థాయికి చేరింది. సాధారణంగా గవర్నర్‌గా నియమితులయ్యేవారు ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. అయితే ఎల్జీలకు నిర్ధారిత పదవీకాలం ఉండదు. అయినా నజీబ్ జంగ్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా, డిసెంబర్ 25 నుంచి వారం రోజులపాటు వ్యక్తిగత పర్యటన నిమిత్తం గోవాకు వెళ్తున్నట్లుగా జంగ్ సంతకంతో తేదీ లేకుండా ఉన్న లేఖ బయటకొచ్చింది.
యూపీఏ హయాంలో పదవీ స్వీకరణ
1973లో ఐఏఎస్‌గా ఎంపికైన నజీబ్ జంగ్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో పలు హోదాల్లో పని చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక శాఖల్లో విధులు నిర్వర్తించారు. జామియా మిలియా యూనివర్సిటీ వీసీగా పని చేస్తున్నప్పుడు 2013 జూలైలో ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో యూపీఏ ప్రభుత్వం జంగ్‌ను ఢిల్లీకి 19వ ఎల్జీగా నియమించింది. ఐదు నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 49 రోజుల్లో కుప్పకూలిన తర్వాత ఏడాది పాటు నగర పాలనా వ్యవహారాలు నిర్వర్తించారు.
కొత్త ఎల్జీ ఎవరు?
కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరొస్తారనే అంశంపై ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఈ జాబితాలో కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అనిల్ బైజాల్ పేరు మొదటి స్థానంలో ఉండగా.. పుదుచ్చేరి ఎల్జీ కిరణ్ బేడీ, ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ పేర్లు కూడా వినబడుతున్నాయి.