భర్త మరణంతో మనోవేదనకు గురై భార్య మృతి
నల్లబెల్లి : భర్త మరణంతో మనోవేదనకు గురైన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందిన సంఘటన మండలంలోని శనిగరం గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన మాట్ల సూరయ్య(60), రాజమ్మ(50) దంపతులు గుడిసెలో నివాసముండేవారు. ఇద్దరు కూలీకి వెళ్తూ జీవించేవారు. సూరయ్య ఈ నెల 9న నిద్రిస్తుండగానే అకస్మాత్తుగా మృతిచెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య రాజమ్మ తీవ్రమనోవేదనతో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. కడుబీద కుటుంబానికి చెందిన మృతురాలి అంత్యక్రియలను గ్రామస్తులు చందాలు వేసుకొని పూర్తి చేశారు.