సీఎం పర్యటనకు ఏర్పాట్లు
నల్లజర్ల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నల్లజర్ల మండలంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం నుంచే ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 1,500 మంది కానిస్టేబుళ్లు, 2 ప్లటూన్ల ఏఆర్ (100 మంది) సిబ్బంది, మహిళా కానిస్టేబుల్స్, కమ్యూనిటీ పోలీసింగ్ సేవలు, డాగ్ స్క్వాడ్లను నియమించినట్టు కొవ్వూరు ఇన్చార్జ్ సీఐ ఎం.మురళీకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించనున్న ప్రాంతాలలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా శుక్రవారం భారీ కాన్వాయ్‌తో ముందస్తు రిహార్సల్స్ చేశారు. ఈ సందర్భంగా తలెత్తిన లోటుపాట్లను సరిదిద్దుకోవాలని అధికారులు సిబ్బందికి సూచించారు.
సీఎం పర్యటన ప్రాంతాలను డీఐజీ రామకృష్ణ పరిశీలన
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించే ప్రాంతాలను డీఐజీ పీవీఎస్ రామకృష్ణ శుక్రవారం ఉదయం జేసీ కోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. పోతవరం, నల్లజర్ల హెలీప్యాడ్స్, పోతవరం, నల్లజర్లలో జరగనున్న మీటింగ్ ప్రాంతాలు సభావేదికలు, సభకు వచ్చే వారికి ఎటు నుంచి అనుమతులు, అనంతరం బయటకు పంపించే మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలు పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఎటువంటి అసౌకర్యాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని కొవ్వూరు డీఎస్పీ మురళీకృష్ణకు సూచించారు.