nallamala forest zone
-
ఫారెస్టు అకాడమీపై ఆశలు
నల్లమల పరిసర ప్రాంతమైతే అన్ని విధాలా అనుకూలమంటున్న స్థానికులు పెద్దదోర్నాల : రాష్ట్ర విభజన అనంతరం అడవుల పంపకమూ పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంత కాలం అటవీ శాఖకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఫారెస్టు అకాడమీ రంగారెడ్డి జిల్లాలోని ధూలపల్లిలో ఉండగా..రాష్ట్ర విభజనతో ప్రస్తుతం అది తెలంగాణకే పరిమితమైంది. కొత్త రాష్ట్రానికి సంబంధించి ఫారెస్టు అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై అటవీ శాఖలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. తూర్పుగోదావరి, తిరుపతి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నా...ఫారెస్టు అకాడమీ ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు మార్కాపురం డివిజన్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. - అటవీ శాఖలో కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి శిక్షణ ఇవ్వడం, వారికి క్షేత్ర స్థాయిలో అడవుల విశిష్టత, వన్యప్రాణుల భద్రత, వివిధ జీవరాసుల ప్రాముఖ్యతను తెలిపేలా అకాడమీలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. - ఉద్యోగుల స్థాయిని బట్టి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు వారికి శిక్షణ ఇస్తారు. దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన నల్లమల ప్రాంతంలో అకాడమీ ఏర్పాటయితే అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉండటంతో పాటు జిల్లాలో వెనుక బడిన పశ్చిమ ప్రాంతానికి సైతం తగిన ప్రాధాన్యత కల్పించినట్లవుతుంది. అకాడమీ ఏర్పాటుకు నల్లమలలో అనుకూలతలివీ.. దక్కన్ పీఠభూమిలోని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల అటవీ క్షేత్రం అతి పెద్ద జీవ వైవిధ్య ప్రాంతం. ప్రకృతి సోయగాలకు నిలయమైన నల్లమలలో అపార వృక్షసంపదే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడే అరుదైన జీవజాతులున్నాయి. - ప్రపంచంలోకెల్లా అరుదైన రాకాసి సాలీడు లు, హార్స్ షూ బ్యాట్ గబ్బిలాన్ని మొదసారిగా పరిచయం చేసింది నల్లమల అటవీ క్షేత్రమే. - జీవ వైవిధ్య కేంద్రాలు ప్రపంచ వ్యాప్తంగా 18 ఉండగా, మన దేశంలో ఉన్న ఐదు జీవ వైవిధ్య కేంద్రాల్లో నల్లమల ఒకటి. - 500 ఎకరాల్లో ఎకోలాజికల్ పార్కు కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. - నల్లమలలోని జీవ వైవిధ్యాన్ని పరిశోధించేం దుకు శ్రీశైలం సమీపంలోని అటవీ ప్రాంతంలో బయోడైవర్సిటీ డివిజన్ కార్యాలయాన్ని 1977లో ఏర్పాటు చేశారు. ఇలాంటి డివిజన్ రాష్ట్రంలో ఇదొక్కటే. - శ్రీశైలం అభయారణ్యంలోని టైగర్ ప్రాజెక్టు దేశంలో అతి పెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు పొందింది. - ఇంతటి ప్రాముఖ్యత ఉన్న న ల్లమల పరిసర ప్రాంతాల్లో అకాడమీ ఏర్పాటయితే ఉద్యోగుల శిక్షణలో ఎంతో పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పలువురు అధికారుల్లో సైతం వ్యక్తమవుతోంది. అదనపు అర్హతలు మరికొన్ని ... మార్కాపురం డివిజన్ పరిధిలోని నల్లమల అటవీ సరిసరాల్లో ఉన్న పెద్దదోర్నాల మండల కేంద్రం రాయలసీమ, కోస్తాంధ్రలకు నడుమ ఉంది. కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, వైఎస్సార్ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడుకు వెళ్లేందుకు అవసరమైన రవాణా సౌకర్యం ఉంది. 35 కిమీ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. అకాడమీ కార్యాలయానికి అవసరమైన భవనాలు నిర్మించడానికి అనువైన ప్రభుత్వ భూములున్నాయి. అకాడమీ ఏర్పాటయితే కార్యాలయంలో అధికారులను, సిబ్బందిని నియమిస్తారు. ఇందులో కొంతవరకు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. -
సీమాంధ్రకు 40, తెలంగాణకు 32 పులులు
నల్లమల విభజన నూతన జోన్ ఏర్పాటు మార్కాపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అధికారులు విభజిం చారు. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నల్లమలలో మొత్తం 72పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 30నుంచి 32 వరకు తెలంగాణలో, 40 వరకు సీమాంధ్రలో ఉండవచ్చుంటున్నారు. టైగర్ ప్రాజెక్టు జోన్‌గా ఈ ప్రాంతాన్ని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగా మార్కాపురం, ఆత్మకూరు, నాగార్జునసాగర్, అచ్చంపేట డివిజన్లను ఏర్పాటు చేసింది. కాగా, విభజన నేపథ్యంలో అచ్చంపేట, నాగార్జునసాగర్ డివిజన్లను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, మార్కాపురం, ఆత్మకూరు డివిజన్లతో పాటు నూతనంగా విజయపురిసౌత్ డివిజన్‌ను సీమాంధ్రకు కేటాయిం చారు. ప్రస్తుతం సీమాంధ్రకు 5,568 చ.కి.మీ రిజర్వు ఫారెస్ట్ ను కేటాయించారు. ఇందులో 3,568 చ.కి.మీ.(కోర్ ఏరియా) పులులు, ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతంగా గుర్తించారు. 2 వేల చ.కి.మీ.(బఫర్ ఏరియా) గ్రామాలకు, అటవీ ప్రాంతానికి మధ్య ఉన్న ప్రాంతంగా గుర్తించారు. మార్కాపురం డివిజన్ 2,280 చ.కి.మీ పరిధిలో ఉండగా, ఆత్మకూరు డివిజన్ 1500 చ.కి.మీ పరిధిలో, విజయపురిసౌత్ డివిజన్ దాదాపు 300 చ.కి.మీ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో 70 కి.మీ ఉన్న బీట్ ప్రాంతాన్ని 20 నుంచి 25 కి.మీలకు తగ్గించి అదనపు బీట్లను ఏర్పాటు చేస్తున్నారు.