
సీమాంధ్రకు 40, తెలంగాణకు 32 పులులు
నల్లమల విభజన నూతన జోన్ ఏర్పాటు
మార్కాపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అధికారులు విభజిం చారు. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నల్లమలలో మొత్తం 72పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 30నుంచి 32 వరకు తెలంగాణలో, 40 వరకు సీమాంధ్రలో ఉండవచ్చుంటున్నారు. టైగర్ ప్రాజెక్టు జోన్‌గా ఈ ప్రాంతాన్ని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగా మార్కాపురం, ఆత్మకూరు, నాగార్జునసాగర్, అచ్చంపేట డివిజన్‌లను ఏర్పాటు చేసింది.
కాగా, విభజన నేపథ్యంలో అచ్చంపేట, నాగార్జునసాగర్ డివిజన్‌లను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, మార్కాపురం, ఆత్మకూరు డివిజన్‌లతో పాటు నూతనంగా విజయపురిసౌత్ డివిజన్‌ను సీమాంధ్రకు కేటాయిం చారు. ప్రస్తుతం సీమాంధ్రకు 5,568 చ.కి.మీ రిజర్వు ఫారెస్ట్ ను కేటాయించారు. ఇందులో 3,568 చ.కి.మీ.(కోర్ ఏరియా) పులులు, ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతంగా గుర్తించారు. 2 వేల చ.కి.మీ.(బఫర్ ఏరియా) గ్రామాలకు, అటవీ ప్రాంతానికి మధ్య ఉన్న ప్రాంతంగా గుర్తించారు. మార్కాపురం డివిజన్ 2,280 చ.కి.మీ పరిధిలో ఉండగా, ఆత్మకూరు డివిజన్ 1500 చ.కి.మీ పరిధిలో, విజయపురిసౌత్ డివిజన్ దాదాపు 300 చ.కి.మీ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో 70 కి.మీ ఉన్న బీట్ ప్రాంతాన్ని 20 నుంచి 25 కి.మీలకు తగ్గించి అదనపు బీట్‌లను ఏర్పాటు చేస్తున్నారు.