‘నల్లమల’మూవీ రివ్యూ
టైటిల్ : నల్లమల
నటీనటులు : అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు
నిర్మాణ సంస్థ : నమో క్రియేషన్స్
నిర్మాత: ఆర్.ఎమ్
దర్శకత్వం :రవి చరణ్
సంగీతం : పీ.ఆర్
సినిమాటోగ్రఫీ : వేణు మురళి
ఎడిటర్: శివ సర్వాణి
విడుదల తేది : మార్చి 18,2022
పలు సినిమాల్లో విలన్ నటించి,మెప్పించిన అమిత్ తివారి ‘నల్లమల’తో హీరోగా మారాడు. బిగ్‌బాస్ 2 ఫేమ్ భానుశ్రీ ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎమున్నావే.. పిల్లా’సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క పాట.. ‘నల్లమల’కు హైప్ క్రియేట్ చేసింది. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం(మార్చి 18) ప్రేక్షకుల మధ్యకు వచ్చిన ‘నల్లమల’చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘నల్లమల’కథేంటంటే..
గిరిజన యువకుడు నల్లమల(అమిత్ తివారి)కి ప్రకృతి, సాధుజంతువులపై అమితమైన ప్రేమ. నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండే ఓ గూడెంలో నివసిస్తూ అక్కడి ప్రజలకు సహాయం చేస్తుంటాడు. మొరటోడులా కనిపించే నల్లమలకు ఆవులంటే చాలా ఇష్టం. అలాగే తన గూడెంలో నివసించే వనమాలి(భానుశ్రీ)అంటే కూడా ఆయనకు ప్రాణం. ప్రకృతి, సాధుజంతువులే లోకంగా భావించే నల్లమలకు అడవిలో జరిగే అక్రమ వ్యాపారం గురించి తెలుస్తోంది. దీంతో ఆయన అక్రమ వ్యాపారం చేస్తున్నవారికి ఎదురు తిరుగుతాడు.మరి నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారం ఏమిటి? అది ఎందుకు చేస్తున్నారు? గిరిజనుడైన నల్లమల దాన్ని ఎందుకు ఎదిరించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..?
ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రవి చరణ్. శాస్త్రవేత్త (నాజర్)ను గిరిజనలు వెంటాడటంతో ఎమోషనల్ నోట్‌తో నల్లమల సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్కూల్ పిల్లలకు ఎలాంటి అంశాలతో పాఠ్యాంశాన్ని పుస్తకంలో చేర్చాలనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కథ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక మాజీ నక్సలైట్ (చత్రపతి శేఖర్) చెప్పే ఫ్లాష్ బ్యాక్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. సాధారణంగా ప్రతి దర్శకుడు తన డెబ్యూ మూవీకి సేఫ్‌గా ప్రేమ కథను ఎంచుకుంటారు.కానీ రవి చరణ్ మాత్రం తొలి ప్రయత్నంలోనే ఓ మంచి సందేశాత్మక కథను ఎంచుకున్నారు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. డెబ్యూ డెరెక్టర్‌గా కాకుండా ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. కానీ ఫస్టాప్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగడం.. సెకండాఫ్ వరకు అసలు కథపై క్లారిటీ రాకపోవడం సినిమాకు కాస్త మైనస్. ప్రీ క్లైమాక్స్ లో అసలు విషయం రివీల్ అవుతుంది. దాన్ని మరింత బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే..
విలన్‌గా పలు సినిమాల్లో నటించి, టాలీవుడ్లో తనకంటే ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాధించుకున్నాడు అమిత్ తివారి. హీరోగా మారి తొలి ప్రయత్నంగా ‘నల్లమల’లాంటి కథను ఎంచుకోవడం అమిత్‌కు ప్లస్ అయింది. ఈ చిత్రంలోని ఆయన పాత్రకు అన్ని రకాల ఎమోషన్స్ పండించే అవకాశం దొరికింది. దీంతో నల్లమల పాత్రలో అమిత్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. భాను శ్రీ గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో భాను శ్రీ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. శాస్త్రవేత్తగా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, తనికెళ్ల భరణి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. పీ.ఆర్ సంగీతం అదిరిపోయింది. ‘ఎమున్నావే.. పిల్లా’సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. అలాగే తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫి బాగుంది. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ తన కెమెరాలో చక్కగా బంధించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.