గిరిసీమలో మార్మోగిన గోవిందనామం
-కన్నుల పండువగా శ్రీనివాస కళ్యాణం
-రంపచోడవరం వీధుల్లో శోభాయాత్ర
రంపచోడవరం : ‘గోవిందా.. హరిగోవిందా..’ అన్న దేవదేవుని నామస్మరణతో రంపచోడవరం మారుమోగింది. అన్నమయ్య సంకీర్తనలు, కోలాటాలు, గిరిజన నృత్యాలు, భజన బృందాలతో స్థానిక పీఎంఆర్సీ నుంచి ఐటీడీఏ, అంబేడ్కర్ సెంటర్ మీదుగా శోభాయాత్ర సాగింది. పవనగిరి వ్యవస్థాపకుడు తణుకు వెంకటరామయ్య యాత్రకు నేతృత్వం వహించారు. నారాయణగిరి వెంకటేశ్వరస్వామి ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఆరో రోజు ఆదివారం శ్రీనివాసుని కల్యాణం వేదమంత్రాలు, మేళాతాళాల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద కల్యాణం ద్వారకా తిరుమల పండితుల మంత్రాలు, చిలకపాటి విజయయరాఘవచారి వ్యాఖ్యానంతో జరిగింది. ఉత్సవ విగ్రహాలను గరుడ వాహనంపై కల్యాణ వేదిక వద్దకు భక్తుల కోలాహలం నడుమ తీసుకువచ్చారు. రెండు గంటలు జరిగిన కల్యాణమహోత్సవాన్ని దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తిలకించారు. తొలుత మంత్రి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ దంపతులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. వారికి దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు స్వాగతం పలికారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 108 దేవాలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ద్వారకా తిరుమల దేవస్థానం ఉప దేవాలయంగా ఇక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం సదుపాయం కోసం సీఎంతో చర్చించానున్నట్లు తెలిపారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గిరిజనులు భక్తిభావంతో మెలగాలని, ఏజెన్సీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దేవాదాయశాఖ అధికారులు వేంద్ర త్రినాథరావు, హిందూధర్మరక్షణ ట్రస్ట్ చైర్మన్ పీఆర్కే ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, సర్పంచ్ వై.నిరంజనీదేవి, ఎంపీటీసీ సభ్యురాలు కారుకోడి పూజ, సాదిక్ మాస్టార్ తదితరులు పాల్గొన్నారు.