వైఎస్సార్ సీపీలో చిరంజీవి అనుచరుడు నంబూరి చేరిక
తిరువూరు, న్యూస్‌లైన్ : ప్రస్తుత కేంద్ర మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన నాటినుంచి ఆయన వెన్నంటి నిలిచిన జాతీయ హస్తకళల అభివృద్ధి సంస్థ డెరైక్టర్ నంబూరి శ్రీనివాసరావు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన జనభేరి కార్యక్రమంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో నంబూరి శ్రీనివాసరావు పార్టీలో చేరారు. అనంతరం తిరువూరు వచ్చి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆయనను రక్షణ నిధి అభినందించారు. శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ నాయకుడు లంకలపల్లి రమేష్ తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు.
వైఎస్సార్ సీపీలోకి కాంగ్రెస్ శ్రేణులు
తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల వైఖరితో విసిగిపోయిన ఆ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ సీపీలో మూకుమ్మడిగా చేరారు. స్థానిక షిర్డీసాయి కల్యాణ మండపంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిలిగడ్డ రక్షణనిధి సమక్షంలో జిల్లా కాంగ్రెస్ కోశాధికారి గజ్జల సీతారామారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డెరైక్టర్ రాజ్‌మహ్మద్, ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి అనుచరుడు ఎండి.కమృద్దీన్, పార్టీ నాయకులు నాయుడు హనుమంతరావు, షేక్ ఇబ్రహీం, అన్సారీ, సయ్యద్ కరీం, చల్లా విజయకుమారి, తెలుగుదేశం పార్టీ నుంచి నల్లగట్ల భరత్, శ్యాంకుమార్, వేల్పుల భరత్, ప్రవీణ్, మహేష్, ఇటీవల నగరపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీచేసిన కప్పల రామకృష్ణ, షేక్ గఫార్, కంభం సుశీల, ముస్లిం మైనారిటీ నాయకులు, రిటైర్డు ఉద్యోగులు అధికసంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరారు.