బీఎస్పీ బీఫారం అందుకుంటున్న శ్రీనివాసరావు
సాక్షి, తిరువూరు : జనసేన–బీఎస్పీ పొత్తు నేపథ్యంలో తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ సీటును బీఎస్పీకి కేటాయించడంతో జనసేన తరపున పోటీ చేయాలని ప్రచారసామగ్రి సన్నద్ధం చేసుకున్న అభ్యర్థి నంబూరి శ్రీనివాసరావు రాత్రికి రాత్రి పార్టీ మారిపోయారు. తాను సిద్ధం చేసిన ప్రచార వాహనాలపై గ్లాసు గుర్తు స్థానంలో ఏనుగు గుర్తు ఉంచి పోటీకి సిద్ధమయ్యారు. బీఎస్పీ కార్యాలయం నుంచి బీఫారం తెచ్చుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.
మొత్తం మీద గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు నంబూరి ఐదు పార్టీలు మారారు. తొలుత 2009లో ప్రజారాజ్యం టికెట్ ఆశించిన ఆయన చివరిక్షణంలో అధిష్టానం మొండిచేయి చూపడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డైరెక్టరుగా కొద్దికాలం పనిచేశారు. తదుపరి తెలుగుదేశంలో చేరిన ఆయన పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించడంతో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తిరువూరు సీటును బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో జనసేన కోల్పోవడంతో బహుజన సమాజ్ పార్టీలో చేరి టికెట్ పొందారు.
Comments
Please login to add a commentAdd a comment