నమ్మ గ్రామానికి ‘అమ్మ’ అభినందన
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : రెండు జాతీయ అవార్డులతోపాటు సీఎం జయలలిత అభినందనలను అందుకున్న చిత్రం నమ్మ గ్రామం. కుల మతాల జాఢ్యం, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఇంతకుముందు పలు చిత్రాలు వచ్చినా వాటికి భిన్నంగా యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం నమ్మ గ్రామం అని ఆ చిత్ర దర్శకుడు మోహన్‌శర్మ తెలిపారు. తమిళం, తెలుగు, మలయా ళం, కన్నడం భాషల్లో 17కు పైగా చిత్రాల్లో వివిధ తరహా పాత్రలు పోషించి గుర్తింపు పొందిన ఈయన నిర్మాతగా 17 చిత్రాలు నిర్మించారు. 2002లో దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన మోహన్‌శర్మ తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం నమ్మ గ్రామం.
దర్శకుడు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి చిత్రాన్ని తెరకెక్కించాలని భావించానన్నారు. సుమారు 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నమ్మ గ్రామం చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. జాతి జాఢ్యం ఎంతగా పెరిగిపోయింది, దాని పరిణామాలేమిటి? అనే అంశాలను సహజసిద్ధంగా తెరకెక్కించినట్లు తెలిపారు. ఇందులో నిషాంత్, సమృతతోపాటు సుకుమారి, వై.జి.మహేంద్రన్, ఫాతిమాబాబు, నళిని నట్టించారని, తాను కూడా నటించినట్లు చెప్పారు. నమ్మ గ్రామం చిత్రంలో నటించిన సుకుమారి ఉత్తమ సహాయ నటిగాను, ఇందిరన్ జమున ఉత్తమ కాస్ట్యూమర్గాను, 2012లో జాతీయ అవార్డులను అందుకున్నారని, ముఖ్యమంత్రి జయలలిత చిత్రం చూసి చాలా మంచి చిత్రం అంటూ అభినందించారని దర్శకుడు తెలిపారు. గుణచిత్ర పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 3న విడుదల చేయనున్నట్లు తెలిపారు.