రైలు పట్టాల వద్ద బీజేపీ నేత మృతదేహం
హూగ్లీ: పశ్చిమ బెంగాల్లో ఓ బీజేపీ నేత అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతడి మృతదేహం హుగ్లీ జిల్లాలోని ఓ రైలు పట్టాల సమీపంలో పడి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అతడు ప్రచారం చేయడం వల్ల ఆ పార్టీ నేతలే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. హుగ్లీ జిల్లాలో కనైపూర్ గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ నేత నందగోపాల్ ఠాకూర్(53) కొన్ని గంటలపాటు కనిపించకుండా పోయాడు.
అయితే, అతడు షిరాపులి, దిరా రైల్వే స్టేషన్ల మధ్య విగత జీవిగాపడి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శరీరంపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బీజేపీ నేత ఒకరు స్పందిస్తూ గత ఏప్రిల్ 25న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఠాకూర్ ప్రచారం చేశాడని, అందుకే కక్ష కట్టి ఆ పార్టీ నేతలే హత్య చేసి ఉంటారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. అవన్నీ ఆధారం లేని మాటలని తోసిపుచ్చింది.