తెలంగాణ సాహిత్య అకాడమీ నా కల
- అకాడమీ ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు
- అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నందిని సిధారెడ్డి
హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పాటు కావాలనేది నా మొదటి కల. తెలంగాణ సాహిత్య అకాడమీ స్థాపన నా రెండో కల. ఇప్పుడు ఈ 2 స్వప్నాలు నెరవేరడం సంతోషంగా ఉంది’’ అని రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతిలో అకాడమీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణా చారి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమక్షంలో అధ్యక్ష ఆసనంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా రవీంద్రభారతి ప్రధాన వేదికపై అభినందన సత్కార సభ జరిగింది. కేవీ రమణాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ.. నందిని సిధారెడ్డి గొప్ప బావుకుడని, తెలంగాణ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా నియమితులవుతూనే.. తన వెంట ప్రపంచ తెలుగు మహా సభలను తీసుకొస్తున్నారని అన్నారు.
కవులే నా సంపద: సిధారెడ్డి
సిధారెడ్డి తన స్పందనను తెలియజేస్తూ.. సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో కేబినెట్ హోదా తీసుకునే శక్తి ఉన్నా.. తెలుగు సాహిత్యంపై మమకారంతో ఆ పని చేయలేదని, ఆలస్యంగానైనా అకాడమీ అధ్యక్షుడిగా నియమితులైనందుకు గర్వంగా ఉందని చెప్పారు. కవులే తన సంపదని అన్నారు. 34 ఏళ్ల తర్వాత కొత్త రాష్ట్రంలో కొత్త అకాడమీని ఏర్పాటు చేసిన కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్యప్రచారం, పరిశోధన, ప్రచురణలు, వర్తమాన కవులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. కొత్త తరానికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. పుస్తకాలను అచ్చు వేయలేని వారిని ప్రోత్సహిస్తామని ప్రకటించారు.
ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కృషి
ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి సాహిత్య అకాడమీ కృషి చేస్తుందని, సాహిత్య అకాడమీ తెలుగు వర్సిటీతో కలసి పనిచేస్తుందని తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య యస్వీ సత్యనారాయణ అన్నారు. వివక్షకు గురైన కళలు, సాహిత్యం, చరిత్రకు పూర్వ వైభవం వస్తుం దని, తెలంగాణలో సాహిత్య అకాడమీ దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు ఆకాంక్షించారు. అన్ని అర్హతలున్న వ్యక్తికి సాహిత్య అకాడమీ పదవి దక్కిందని, తెలం గాణ సాహిత్యం మళ్లీ ఓ వెలుగు వెలుగుతుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు.
కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి, ప్రముఖ రచయి త ఎన్ గోపి, ప్రముఖ కవి కె.శివారెడ్డి, గ్రంథాలయా ల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రసమయి, రామలింగా రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరి కృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు గౌరీశంకర్, వకుళాభర ణం కృష్ణమోహన్, కవయిత్రి ఓల్గా, సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు రవీందర్రెడ్డి హాజరయ్యారు.