ఐసీయూలో 'నెక్ట్స్ సీఎం'
బెంగళూరు : 'నానే నెక్ట్స్ సీఎం' (తదుపరి ముఖ్యమంత్రి నేనే) అనే కన్నడ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి రాగిణి ద్వివేది తలకు తీవ్ర గాయమై ఐసీయూలో చేరారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మైసూరు వద్ద ఆమెపై ఓ ఫైట్ సీన్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫైటర్ విసిరిన హాకీ స్టిక్ నుంచి తప్పించుకునే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంతో అది బలంగా రాగిణి తలకు తాకింది.
దీంతో తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆమెను స్థానికంగా ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న రాగిణి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా ప్రీమియర్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న నానే నెక్ట్స్ సీఎం చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు.