Narapally
-
ఊరికి వెళ్తుండగా విషాదం.. కారు పల్టీలు కొట్టి..
సాక్షి, ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారి పరిధిలోని నారపల్లి నందనవనం వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును అతివేగంగా నడిపి డివైడర్‌ను ఢీకొట్టడంతో..పల్టీలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు బైకుపై వెళ్తున్న తండ్రీ కొడుకులను ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా పాలకుర్తి మండలం రాగాపురానికి చెందిన మానుపాటి సోమయ్య (70) పండుగ సెలవుల నేపథ్యంలో తన చిన్నకుమారుడు కృష్ణ, మనవడు వినేష్‌తో కలిసి శుక్రవారం ఉదయం బైకుపై కూకట్పల్లి నుంచి స్వగ్రామం రాగాపురానికి బయలుదేరారు. వీరు మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నారపల్లికి చేరుకోగానే వరంగల్ వైపు నుండి మేడిపల్లి వైపు వస్తున్న కారు ఒక బస్సును ఓవర్టేక్ చేస్తూ డివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతల నుండి వస్తున్న కృష్ణ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన సోమయ్య, కృష్ణలు అక్కడికక్కడే మృతిచెందగా వినేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న చౌదరిగూడ ప్రాంతానికి చెందిన విక్రాంత్‌రెడ్డి (20) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమయ్య కుమార్తె శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మలి సంధ్యలో మతాబుల వెలుగులు
సాక్షి, హైదరాబాద్: అనాథలు, వృద్ధులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న ‘వి ఫర్ ఆర్ఫాన్’ సంస్థ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. కుటుంబ సభ్యుల నిరాదరణకు లోనై వృద్ధాశ్రమంలో అనాథలుగా కాలం వెళ్లదీస్తున్న దీనుల కళ్లలో కాంతులు నింపింది. ఉప్పల్ సమీపం నారపల్లిలో ఉన్న లహరి వృద్ధాశ్రమంలో శనివారం వి ఫర్ ఆర్ఫాన్ సభ్యులు దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు, అనాథ పిల్లలతో దీపావళి పండుగ జరిపించి వారి మోముల్లో చిరునవ్వులు పూయించారు. అంతేకాదు 25 మంది వృద్ధులకు కొత్త బట్టలు అందించారు. స్వయంగా వృద్ధులకు మిఠాయిలు తినిపించి, వారి చేత దీపావళి బాణసంచా కాల్పించి సంతోషాలు పంచారు. తమకెంతో ఇష్టమైన బిర్యానీని కూడా స్వయంగా తినిపించి సొంత కుటుంబ సభ్యుల్లా ఆప్యాయత చూపడంతో వృద్ధులు కరిగిపోయారు. అందరూ ఉన్న అనాథల్లా గడుపుతున్న తమకు పండుగ ఆనందాన్ని పంచిన వారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంబీసీ డీఎస్టీ నవనిర్మాణ సమితి రాష్ట్ర కన్వీనర్ బెల్లాపు దుర్గారావు అతిథిగా హాజరయ్యారు. చేర్యాల రాకేశ్, చేర్యాల విద్య, యోగిత, ఛార్మ్స్ సంపత్, హరీశ్, మాట్రిక్స్ రమేశ్, బేగంపేట రాజు, సుశీల్, ముకేశ్, కిరణ్, జైహింద్, చందుభాయ్, దుర్గాప్రసాద్, సింగిరాల శ్రవణ్‌కుమార్, నర్సింగ్, దొప్పల నరేశ్ తదితరులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పెట్రోల్ పోసి వ్యక్తిని తగలబెట్టిన దుండగులు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం నర్లపల్లిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన బుధవారం వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.