మహిళా సర్పంచ్‌పై దాడి
గజపతినగరం, న్యూస్‌లైన్: గజపతినగరం మేజర్ పంచాయతీ సర్పంచ్ నరవ ఆదిలక్ష్మిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. ఎంపీటీసీ సెగ్మెంట్‌కు సంబంధించి ఓట్ల విషయమై చర్చిస్తుండగా మాటామాటా పెరిగి నరవ మల్లేష్, పైడిరాజులు ఆమెపై దాడికి దిగారు. దీంతో నరవ ఆదిలక్ష్మి తన అనుచరులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
సీఐ చంద్రశేఖర్ దీనిపై స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ సర్పంచ్ మాత్రం నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ, మక్కువ శ్రీధర్, సీపీఐ నాయకులు ఆల్తి అప్పలనాయుడు, బీజేపీ నాయకులు పీవీవీ గోపాలరాజు తమ అనుచరులతో కలిసి అక్కడకు వచ్చారు.
దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో బొబ్బిలి డీఎస్పీ, షేక్ ఇషాక్ అహ్మద్ శనివారం ఉదయం పది గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకువచ్చి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.దీంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు.