నారావారిపల్లెలో శ్మశానం మాయం
తిరుపతి రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత పంచాయతీలో శ్మశానం మాయమైందని, దీంతో ఎవరైనా మరణిస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నారావారిపల్లె, కందులవారిపల్లె వాసులు తెలిపారు. మాయమైన శ్మశానాన్ని వెతికి పెట్టాలని జన్మభూమిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని కొరారు. నారావారిపల్లెకు చెందిన కందులవారిపల్లెలో బుధవారం జన్మభూమి-మా ఊరు కార్యక్రమం జరిగింది. సర్పంచ్ పాశం చంద్రకుమార్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నారావారిపల్లె, కందులవారిపల్లె, శేషాపురానికి గతంలో 1.31 ఎకరాల విస్తీర్ణంలో శ్మశానం ఉండేదని పంచాయతీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొన్నేళ్లుగా శ్మశానం పూర్తిగా ఆక్రమణలకు గురైందన్నారు. దీంతో ఎవరైనా మరణిస్తే సొంత భూముల్లో ఖననం చేస్తున్నట్లు తెలిపారు. భూములు లేని వారు మూడు గ్రామా లకు దూరంగా ఉన్న భీమవరం గ్రామ సమీపంలో దహనక్రియలు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైందని, గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు. పశువుల గడ్డి కోసం కేటాయించిన భూమి సైతం కబ్జాకు గురైందని, కాపాడాలని ఎమ్మెల్యేని వేడుకున్నారు.
స్పందించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాష్ట్రంలోనే ప్రముఖ పంచాయతీ అయిన నారావారిపల్లెలో సమస్యలు లేకుండా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. శ్మశాన భూమిని పూర్తిగా సర్వే చేసి ఆక్రమణల నుంచి విముక్తి కలిగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని, అందుకు అందరూ కలిసి నడవాలని పిలుపునిచ్చారు.