అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
కంబదూరు, న్యూస్‌లైన్: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు స్థానికంగా నివసించే కమ్మ గోపాల్ (49) తనకున్న ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవాడు. ఐదేళ్ల నుంచి వరుస కరువుల కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. దీనికి తోడు అప్పు చేసి తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు చేశాడు.
అప్పులు రూ.6 లక్షలకు చేరాయి. ఈసారి కూడా పంట సరిగా పండకపోగా, రుణదాతల ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో మంగళవారం భార్య పుట్టింటికి వెళ్లగా ఒంటరిగా ఉన్న అతను బుధవారం తెల్లవారుజామున ఇంట్లోని దూలానికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అతని ఇంటి వద్దకు వెళ్లిన బంధువులు తలుపులు తెరచి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఎస్ఐ నారాయణ యాదవ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.