హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ
ట్రెండ్ అనేది ఉందా? నో అంటారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిందా? అస్సలు కానే కాదు అంటారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ మార్తాండ’. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఇక కృష్ణవంశీ ఇంటర్వ్యూలోకి వెళదాం...
► మీ కెరీర్లో ‘రంగ మార్తాండ’ రెండో రీమేక్ (నాగార్జునతో తీసిన ‘చంద్రలేఖ’ మలయాళ రీమేక్ ). మళ్లీ రీమేక్ సినిమా చేయాలని ఎందుకనుకున్నారు.. కథలు రాయలేకపోతున్నారా?
కృష్ణవంశీ : (నవ్వుతూ)... కథలు రాయలేకపోవడం కాదు. ‘రంగ మార్తాండ’ నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ రీమేక్‌లో నటించడంతో పాటు డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రకాశ్‌రాజ్. ‘ఈ సినిమాని రీమేక్ చేయా లనుకుంటున్నాను. నాకు స్క్రీన్ ప్లేలో సహాయం చెయ్’ అని అడిగాడు. ఒకరోజు రాత్రి కూర్చుని చూడటం మొదలెట్టా.. ఒకచోట కాదు ఐదార్లు చోట్ల ఏడుపొచ్చేసింది. ‘ఇది ఎక్స్ట్రార్డినరీ సినిమా. రీమేక్ చెయ్, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను’ అని ప్రకాశ్‌తో అన్నాను. ‘నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం కంటే నువ్వెలాగూ ఎమోషన్స్‌ని అద్భుతంగా డీల్ చేస్తావు. నన్ను కూడా బాగా డీల్ చేస్తావు. నువ్వు డైరెక్ట్ చేస్తే బావుంటుంది. నాకోసం చెయ్’ అన్నాడు. సరే అన్నాను. అలా ‘రంగ మార్తాండ’ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను.
► ‘నట సామ్రాట్’లో మిమ్మల్ని అంతగా కదిలించినదేంటి?
ఇది మన తల్లిదండ్రుల కథ. మన తల్లిదండ్రులకు కావాల్సినంత విలువ ఇస్తున్నామా? లేదా గౌరవించి తప్పుకుంటున్నామా? అనే పాయింట్ ఉంది. సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మారుతోంది. సక్సెస్ సాధించాలని పరుగు తీయడంలోనో, అందరితో పొగిడించుకోవాలనే ప్రయత్నంలోనో, అందరికంటే అధికుణ్ణి అనిపించుకోవాలనే తపనలోనో మనల్ని మనం కోల్పోతున్నాం. అది ‘నట సామ్రాట్’లో నాకు కనిపించింది.
ఇది ఒక స్టేజ్ యాక్టర్ కథ. అతను స్టేజ్ మీద విలువలతో బతికినవాడు.. బ్రహ్మాండమైన నటుడు. అందుకే ‘రంగ మార్తాండ’ అనే బిరుదు ఇస్తారు. ఆ బిరుదు వచ్చిన రోజునే అతను నటనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. అప్పటివరకూ నటుడిగా రంగుల ప్రపంచం, నిరంతరం చప్పట్ల మధ్య ఉండే అతను నిజ జీవితంలో తండ్రిగా, తాతగా, భర్తగా, స్నేహితుడిగా తన పాత్ర పోషించే సమయంలో లైఫ్‌లో ఎంతమంది నటులున్నారో తెలుస్తుంది. అతను నమ్మిన ఆదర్శాలకు, బయట నిజాలకు క్లాష్ అవుతుంది. తల్లిదండ్రులు స్వార్థపరులయిపోయారు. పిల్లలు స్వార్థపరులయిపోయారు అని నిందించకుండా ఎవరి పాయింట్లో వాళ్లే కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ, వాళ్ల మధ్య క్లాష్ ఎలా వస్తుంది? అనేదే ఈ కథ.
► ‘రంగ మార్తాండ’ మళ్లీ మిమ్మల్ని హిట్ ట్రాక్‌లోకి తీసుకుని వస్తుందనుకుంటున్నారా?
నేను ఇలా చెబితే నమ్మశక్యంగా ఉంటుందో లేదో తెలియదు కానీ హిట్ కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు.
ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ఇదెందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమయిందేంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి... అంతే.
► ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా సాగుతోంది. ఈ ట్రెండ్‌ని మీరెలా చూస్తారు?
నా చిన్నప్పటినుంచి మా ఊర్లో హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమా (తెలుగు) దేశం నలు మూలలకు వెళుతోంది. అన్ని ప్రాంతాల వాళ్లు ఆదరిస్తున్నారు. ఇది కేవలం సౌత్ సినిమాలా కాకుండా సౌత్ సినిమాని కూడా ఇండియన్ సినిమాగా చేయొచ్చు అనే అర్థంతో పాన్ ఇండియా సినిమా అంటున్నారని అనుకుంటున్నాను.
► మీరు పాన్ ఇండియా సినిమా ట్రై చేస్తారా?
ఏమో చెప్పలేం. అది సినిమాను బట్టి ఉంటుంది.
► కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కానీ దానికంటే ముందే మీకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం?
ఆటోమేటిక్‌గా వచ్చేసింది అలా. ఫ్లాప్ అయిన తర్వాత పుంజుకోవడం కష్టం. హిట్.. ఫ్లాప్ అనేది నేను తీసుకోను. కానీ ఆ ఎఫెక్ట్ నా మీదుంటుంది. హిట్ కోసమని మెట్టు దిగి, దిగజారి ప్రజల్ని మభ్యపెట్టి సినిమా తీయలేను. రాజీ పడలేను. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు కదా. గ్యాప్ అయితే ఫ్లాప్స్ వల్లే వచ్చింది. హిట్ ఇస్తుంటేనే ఇండస్ట్రీలో ఫాస్ట్‌గా ఉంటాం.
► ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని కొంత వల్గర్ కామెడీ, రేంజ్‌కి మించిన వయొలెన్స్ తీస్తున్నారు కొందరు... దీని గురించి మీరేం అంటారు?
ప్రేక్షకుల మైండ్ సెట్ మారలేదని నా అభిప్రాయం. అయినా ఇదో ఫేజ్ అనుకుంటున్నాను. మనం ఆ తరం (పాత సినిమాలు) చూశాం కాబట్టి ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం. కానీ ఇప్పటివాళ్లు ఇవే చూశారు కాబట్టి వారికి ఇదే కరెక్ట్ అనిపిస్తుందేమో.
► ఫార్ములా ఫాలో కాకపోతే మీరు పోటీలో ఎలా నిలబడతారు?
సినిమా తీసే ఫార్మాట్ ఒక్కటే మారింది. బేసిక్ ఎమోషన్స్ అన్నీ అవే. అదే లవ్, అదే ఫ్యామిలీ, అదే విలనిజం అన్నీ అవే. మంచి మీద చెడు గెలుస్తుంది అని చివర్లో చెప్పడం. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. అలా అని ప్రయాణం మానేస్తామా? మన ప్రయాణం మనది. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా, వీలైతే మన వల్ల కొందరైనా పాజిటివ్‌గా ఉండగలుగుతున్నారా అనేదే మనం పట్టించుకోవాల్సింది. సో.. పోటీ గురించి భయపడటం, బాధపడటం నాకు రాదు.
► అలాగే ఒకప్పుడు ఎమోషన్ అంటే బలంగా చూపించేవారు. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో లైటర్‌వీన్‌గా కనిపిస్తోంది. అదేమంటే ట్రెండ్ మారిందంటున్నారు...
ఎమోషన్ని స్ట్రాంగ్‌గా చూపించడానికి ఇష్టపడటంలేదా? తెలియడం లేదా? చేతకావడం లేదా? దాసరిగారిలా, కేవీ రెడ్డిగారిలా, విశ్వనాథ్‌గారిలా సినిమాలు తీయలేం. అలా ఎవ్వరూ తీయలేరు కాబట్టి ట్రెండ్ మారింది అనుకుందామా? కరెక్ట్‌గా తీయగలిగితే అలా అనుకోనక్కర్లేదా? మరి.. కరెక్ట్‌గా తీయడం అంటే ఏంటని నన్ను అడగకండి. నాక్కూడా తెలియదు.
‘శంకరాభరణం’ సినిమాను ప్రపంచం ఆదరించింది కదా? ట్రెండ్ అంటూ ఏదీ లేదు. ట్రెండ్ అంటే నా దృష్టిలో బూతు. మనకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అందర్నీ నీతిగా నిజాయితీగా సామరస్యంగా ఉండాలనే బోధించాయి. ఏ మతమయినా ఇదే చెప్పింది. ఇప్పటికీ మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఒక మతంలా అయిపోయింది. ఏం మాట్లాడాలి? ఏం బట్టలు వేసుకోవాలి? అన్నీ సినిమా చెబుతుంది. సో... అలాంటి మీడియమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేసినా సోషల్ బెనిఫిట్ ఉండాలి. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్.. ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా తీయాలి.
► ‘రంగ మార్తాండ’కి చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ గురించి?
ఒక నటుడు తనని తనెలా అర్థం చేసుకుంటాడు? అనేది ఓ కాన్సెప్ట్‌లా అనుకుని, వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నాను. రచయిత లక్ష్మీ భూపాల్‌తో రెగ్యులర్ పాటలా.. మాటాలా వద్దు.. షాయిరీలా చెప్పిద్దాం.. అలా రాయమని అన్నాను. ఇదే మాట ఇళయరాజాగారికి చెబితే ‘నువ్వు రాయించుకుని తీసుకురా చేద్దాం’ అన్నారు. బ్రహ్మాండంగా వచ్చింది.
ఈ వాయిస్ ఓవర్‌ని ఏదైనా పెద్ద యాక్టర్‌తో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తట్టినవి రెండే పేర్లు. సీనియర్ ఎన్టీఆర్‌గారు... చిరంజీవిగారు. చిరంజీవిగారికి ఫోన్ చేస్తే, రమ్మన్నారు. వెళ్లి, వివరించాను. షాయరీ ఐడియా విని ఆయన థ్రిల్లయ్యారు. ‘నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంది’ అన్నారు.
► అన్నం’ సినిమా అనౌన్స్ చేశారు?
‘రంగ మార్తాండ’ తర్వాత అదే చేస్తాను. ‘సింధూరం, ఖడ్గం, మహాత్మ’ ఆ జోన్ ఫిల్మ్ ఇది. ఫుడ్ మాఫియా, వ్యవసాయం, అన్నం, మనిషి తన స్వార్థం కోసం ఆవుల్ని, కోళ్లను ఎలా వాడుకుంటున్నాడు? అనేది కాన్సెప్ట్.
► ‘రంగ మార్తాండ’ సినిమాలో ఒక నటుడు తన రియల్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడో చూపిస్తున్నారు. మరి.. మీ లైఫ్‌ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది?
నా అర్హతకి కొన్ని వేల రెట్లు ఎక్కువే ఇచ్చింది ఈ జీవితం. ఇప్పుడు నా మనసిక స్థితి ఎలా ఉందంటే.. ఏం చేసినా అది నేను చేయలేదు. అది (విధి) చేయించింది నాతో. ఎంత కాలం చేయించదలచుకుంటే అంత కాలం చేయిస్తుంది. నేనంటూ ఏం కోరుకోవడం లేదు. మన పుట్టుక మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మా ఊరి నుంచి మద్రాస్ తోసింది, అక్కడి నుంచి వర్మగారి దగ్గరకు తోసింది హైదరాబాద్‌కు. అక్కడ నుంచి దర్శకుడిని అయ్యాను. అన్నీ అలా జరుగుతూ వచ్చేశాయి.. అంతే.
► చాలామంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.. మీకు ఆ ఉద్దేశం లేదా?
వచ్చే ఏడాది చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు.
► మీ సినిమాల్లో హీరోలతో బ్రహ్మాండంగా నటింపజేశారు. మీ అబ్బాయి రిత్విక్తో సినిమా చేస్తారా?
వాడేం అవ్వాలనుకుంటాడో అది వాడి ఇష్టం. కాసేపేమో ఫుట్‌బాల్ అంటాడు. రేసర్ అంటాడు. యాక్టర్ అంటాడు. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్నాడు కదా. కొత్తది ఏది చూసినా దాని మీదకు ధ్యాస వెళ్లిపోతుంది.
► మీ అబ్బాయి ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?
నేనేం అనుకోవడంలేదు. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు, రమ్యకృష్ణకి బిడ్డ అయ్యాడంటేనే వాడి అదృష్టం మీకు అర్థం అవుతుంది కదా (నవ్వుతూ).
– డి.జి. భవాని