దస్తూరి అయాచిత వరం!
ఈ ఫొటోలోని వ్యక్తి పేరు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ. విశ్రాంత అధ్యాపకులు. అష్టావధాని, కవి, దాశరథి పురస్కార గ్రహీత! డాక్టర్ నటేశ్వర శర్మ జన్మస్థలం తెలంగాణ, కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి.వృత్తి జీవితం గడిపి, స్థిరపడింది కామారెడ్డిలో. 1977లో, కామారెడ్డిలోని ప్రాచ్యకళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా చేరి, 2014లో అదే కళాశాలలో ప్రధాన ఆచార్యులుగా ఉద్యోగవిరమణ పొందారు. ఆయనకున్న మరో ప్రత్యేకత.. ముత్యాల్లాంటి చేతిరాత. ఆ దస్తూరి చూసి ముచ్చటపడి, ముగ్ధులుకాని వారుండరంటే ఇసుమంతైనా ఆశ్చర్యం లేదు. ఆ చేతిరాతను ఆయనకున్న వరంగా అభివర్ణించుకోవచ్చు. స్వదస్తూరితో నటేశ్వర శర్మ 35 పేజీల పుస్తకాన్ని ముద్రించారు. కవర్ పేజీతో సహా అన్నీ ఆయన చేతి రాతతోనే ఉండడం విశేషం. ఆయనకు రచనావ్యాసంగం పట్ల మక్కువ మెండు. గద్య, పద్య,గేయ కవితలెన్నో రాశారు. యాభైకి పైగా పుస్తకాలు రచించారు. అష్టావధానంలోనూ ఆయన దిట్టే! ఇప్పటివరకు దాదాపు 125కి పైగా అవధానాలు చేశారు. సాహిత్యంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం ఆయనను దాశరథి సాహిత్య పురస్కారంతో సన్మానించింది.అయాచితం నటేశ్వర శర్మ అద్భుతమైన గురువు కూడా. ఆయన దగ్గర చదువుకున్న వందలాది మంది శిష్యులు తెలుగు పండితులుగా, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. సాహిత్యరంగంలోనూ రాణిస్తున్నారు.