కామారెడ్డి(నిజామాబాద్): తెలుగుభాషకు సంబంధించిన కంప్యూటర్ లిపి యూనికోడ్ అధ్యయన భాషావేత్తల బృందంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కవి, డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మకు అవకాశం లభించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో తెలుగు సంగణక యంత్రలిపి పునర్నవీకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ నటేశ్వర శర్మను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగు లిపికి సంబంధించిన పరిణామ క్రమాన్ని డాక్టర్ శర్మ గూగుల్ అధికారులకు వివరించారు. కాగా, ఈ భాషావేత్తల బృందానికి సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందం కొన్ని వారాల్లోనే తెలుగు లిపిపై నివేదికను గూగుల్ సంస్థకు అందజేయనుంది. ఈ విషయాన్ని డాక్టర్ నటేశ్వరశర్మ సాక్షికి ఫోన్ ద్వారా తెలియజేశారు.