Soma Mondal: క్వీన్ ఆఫ్ స్టీల్
పెద్ద బాధ్యతను స్వీకరించినప్పుడు గర్వించదగిన క్షణాలు మాత్రమే ఉండవు. పెద్ద పెద్ద సవాళ్లు కాచుకొని కూర్చుంటాయి. భయపెడతాయి. ఆ సవాళ్లకు భయపడితే అపజయం మాత్రమే మిగులుతుంది. వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉంటే విజయం సొంతం అవుతుంది. ఇంజినీరింగ్ చదివే రోజుల నుంచి ఉక్కు పరిశ్రమలోకి అడుగు పెట్టే వరకు, ఉద్యోగ ప్రస్థానంలో రకరకాల సవాళ్లను ఎదుర్కొంది సోమా మండల్. వాటిని అధిగమించి అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంది.
తాజాగా...
ఫోర్బ్స్ ‘వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్– 2023’ జాబితాలో చోటు సంపాదించింది.
భువనేశ్వర్‌లోని ఓ బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది సోమా మండల్. తండ్రి అగ్రికల్చర్ ఎకానమిస్ట్. అప్పట్లో చాలామంది తల్లిదండ్రుల ధోరణి ‘ఆడపిల్లలను ఒక స్థాయి వరకు చదివిస్తే చాలు. పెద్ద చదువు అక్కర్లేదు’ అన్నట్లుగా ఉండేది. సోమా తండ్రిలో మాత్రం అలాంటి భావన లేదు.
‘మా అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాను’ అనేవాడు.
అలాంటి వ్యక్తి కాస్తా సోమా ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పుడు ‘కుదరదు’ అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆరోజుల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్ చదవడం అరుదు. తల్లి సహాయంతో నాన్న మనసు మారేలా చేసింది. రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది.
ఇక కాలేజీ రోజుల విషయానికి వస్తే బ్యాచ్‌లో రెండు వందల మంది ఉంటే ఇద్దరు మాత్రమే అమ్మాయిలు. పాఠం వింటున్నప్పుడు ఏదైనా సందేహం అడగాలంటే అబ్బాయిలు
నవ్వుతారేమోనని భయపడేది. అయితే ఒకానొక సమయంలో మాత్రం...
‘అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే చదువు చదువుతున్నప్పుడు భయపడటం ఎందుకు?’ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది...
ఇక అప్పటి నుంచి ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఆ ధైర్యమే తన భవిష్యత్ విజయాలకు పునాదిగా నిలిచింది.
సోమా మెటల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు మహిళా ఉద్యోగులు ఎక్కువగా లేరు. ‘మెటల్ ఇండస్ట్రీ అంటే పురుషుల ప్రపంచం’ అన్నట్లుగా ఉండేది. ఇక మహిళలు ఉన్నత స్థానాల్లోకి రావడం అనేది ఊహకు కూడా అందని విషయం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ భవిష్యత్‌పై ఆశను కోల్పోలేదు సోమా మండల్.
నాల్కో(నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్)లోకి గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలి మహిళా డైరెక్టర్(కమర్షియల్) స్థాయికి చేరింది. 2017లో సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లోకి వచ్చిన తరువాత ఫస్ట్ ఉమెన్ ఫంక్షనల్ డైరెక్టర్, ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది.
సెయిల్ చైర్‌పర్సన్‌గా బా«ధ్యతలు స్వీకరించిన కాలంలో ఆ సంస్థ వేల కోట్ల అప్పులతో ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో మార్పులు తీసుకువచ్చింది. మైక్రో–మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. సెయిల్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేయడానికి మార్గాలు అన్వేషించింది. గ్రామీణ ప్రాంతాలలో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. కొత్త వ్యాపార వ్యూహాలను అనుసరించింది.
సోమా కృషి వృథా పోలేదు. అప్పులు తగ్గించుకుంటూ ‘సెయిల్’ను లాభాల దిశగా నడిపించింది.
‘నా కెరీర్లో జెండర్ అనేది ఎప్పుడూ అవరోధం కాలేదు. మహిళ అయినందుకు గర్వపడుతున్నాను. మన దేశంలో వివిధ రంగాలలో మహిళా నాయకుల సంఖ్య పెరుగుతోంది. లీడర్‌కు అసంతృప్తి ఉండకూడదు. ఆశాభావం ఉండాలి. పరిమిత వనరులు ఉన్నా సరే మంచి ఫలితం సాధించే సామర్థ్యం ఉండాలి’ అంటుంది సోమా మండల్.
టైమ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఇచ్చే సోమా మండల్ అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లింది.
‘సక్సెస్‌కు షార్ట్‌కట్ అనేది లేదు. అంకితభావం, సమర్థత మాత్రమే మనల్ని విజయానికి దగ్గర చేçస్తాయి’ అంటుంది సోమా మండల్.