National Cancer Institute researchers
-
ఆ ఒక్కటీ.. ఒక్కటంటే కూడా ప్రమాదకరమే!
చాలా మంది సిగరెట్ మానేసే ప్రక్రియలో రోజుకు ఒక్కటే తాగుతుంటామని, అలా క్రమంగా తగ్గిస్తామని అనుకుంటుంటారు. అయితే రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే కాదు... సగం సిగరెట్ అయినా అది ప్రమాదకరమే అంటున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులు. ఆ సంస్థలోని క్యాన్సర్ ఎపిడెమియాలజీ అండ్ జెనెటిక్స్ విభాగానికి చెందిన మాకీ ఇన్యోయ్ చోయ్ అనే శాస్త్రవేత్త చెబుతున్న దాని ప్రకారం సగం సిగరెట్ కూడా చాలా ప్రమాదకారి అంటున్నారామె. ఆ అధ్యయనవేత్త ఆధ్వర్యంలో 59 నుంచి 82 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు మూడు లక్షల మందిపై ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాల గురించి ఆమె మాట్లాడుతూ ‘‘కొంతమంది తమ అలవాటు మానలేక సిగరెట్ వెలిగించి, సగం సిగరెట్ అంటూ ఒకటి రెండు పఫ్స్ తీసుకుంటారు. అయితే అసలు సిగరెట్ తాగని వాళ్లతో పోల్చినప్పుడు ఇలా ఒకటి, రెండు పఫ్స్ తీసుకునే 64 శాతం మందికి పొగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే రిస్కు సాధారణ ప్రజల్లో కంటే 12 రెట్లు ఎక్కువని వివరించారు. అలాగే పొగాకు అలవాటు లేని సాధారణ వ్యక్తితో పోలిస్తే సిగరెట్ తాగేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే రిస్క్ సైతం రెండున్నర రెట్లు ఎక్కువని చెబుతున్నారు. -
కేన్సర్‌ను చంపే కణాలు మీలోనే!
వాషింగ్టన్: కేన్సర్ బాధితుల వ్యాధి నిరోధక కణాలతోనే.. కేన్సర్‌ను సమర్థంగా నియంత్రించే విధానాన్ని అమెరికాకు చెందిన నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సాధారణ కణాలు కేన్సర్ కణాలుగా మారడం వల్ల విడుదలయ్యే ఒక ప్రొటీన్‌ను గుర్తించగలిగే వ్యాధినిరోధక కణాలను (ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్స్ - టీఐఎల్) వారు గుర్తించారు. సాధారణంగా మానవ చర్మంలోని మెలనోమా కణితుల్లో ఈ టీఐఎల్లు ఉంటాయి. ఒక ఊపిరితిత్తులు, కాలేయ కేన్సర్లతో బాధపడుతున్న మహిళ నుంచి ఈ కణాలను సేకరించిన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో భారీ సంఖ్యలో అభివృద్ధి చేసి, తిరిగి ఆమె శరీరంలో ప్రవేశపెట్టారు. కొద్ది రోజుల అనంతరం పరిశీలించగా ఆమె ఊపిరితిత్తులు, కాలేయంలోని కేన్సర్ కణితులు.. కొంతవరకూ కుచించుకుపోయినట్లు గుర్తించారు. ఆరు నెలల అనంతరం మళ్లీ ఇదే తరహా చికిత్స చేసి చూడగా.. మరింత అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పరిశోధనకు నేతృత్వం వహించిన స్టీవెన్ రోసెన్‌బర్గ్ చెప్పారు. దీనిని మరింతగా అభివృద్ధి చేసి, మెరుగైన చికిత్సను రూపొందిస్తామని... కేన్సర్ చికిత్సలో ఇదొక గొప్ప ముందడుగని పేర్కొన్నారు.