కేజీ బేసిన్ గ్యాస్ వచ్చేసింది..
ఆర్ఎల్ఎన్జీ పరస్పర మార్పిడికి తొలగిన అడ్డంకులు
అంగీకారం తెలిపినఎరువుల మంత్రిత్వ శాఖ
త్వరలో గెయిల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
అందుబాటులోకి రానున్న 450 మెగావాట్ల విద్యుత్
సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు కొంతమేరకు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్‌లోని డి6 బ్లాక్ నుంచి రిలయన్స్ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను సర్దుబాటు పద్ధతిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మళ్లించేందుకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ గ్యాస్‌తో ఏపీలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు వినియోగంలోకి రానున్నాయి. వాటి నుంచి దాదాపు 450 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్), తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య త్వరలోనే పరస్పర అంగీకార ఒప్పందం జరగనుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రీ గ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఆర్ఎల్ఎన్జీ) ధర తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గ్యాస్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే కొరత నుంచి గట్టెక్కవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. తూర్పు తీరంలో ఉన్న ఏపీకి దూర ప్రాంతాల నుంచి ఆర్ఎల్ఎన్జీని సరఫరా చేసుకునేందుకు పైపులైన్లు లేవు. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి రోజూ 2.2 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ మహారాష్ట్రలోని జాతీయ రసాయనాలు, ఎరువుల యూనిట్ (ఆర్సీఎఫ్)కు తరలివెళుతుంది.
ఇలా కేజీ బేసిన్ నుంచి మహారాష్ట్ర సరఫరా అవుతున్న గ్యాస్‌ను ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుని, ప్రత్యామ్నాయంగా ఆర్‌సీఎఫ్‌కు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆర్ఎల్ఎన్జీని అందించాలని.. దీనికి అదనంగా అయ్యే ఖర్చును ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భరించాలని గతంలో నిర్ణయించాయి. ఈ గ్యాస్ స్వాపింగ్‌కు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఎరువుల మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో అనుమతినిచ్చింది. అయితే ఏపీలోని జీవీకే, స్పెక్ట్రమ్, ల్యాంకో, కోనసీమ, వేమగిరి గ్యాస్ప్లాంట్లకు మొత్తం 2,499 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యముంది. కానీ గ్యాస్ కొరత కారణంగా మూడు పవర్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పుడు అవి తిరిగి ఉత్పత్తి ప్రారంభించనున్నాయి.
మొత్తం తెలంగాణకే..!
ఈ గ్యాస్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి జరిగితే తెలంగాణకు 53.89 శాతం.. విద్యుత్ రావాల్సి ఉంటుంది. వీటిల్లో వాటాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పేచీ కూడా లేదు. ప్రస్తుతం కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా లేకపోవటంతో గ్యాస్ ప్లాంట్ల నుంచి తెలంగాణకు అందుతున్న విద్యుత్ 150 మెగావాట్లకు మించటం లేదు. ఇప్పుడు గ్యాస్ స్వాపింగ్తో మొత్తం 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తయ్యే అవకాశముంది. ఇందులో తెలంగాణకు దాదాపు 250 మెగావాట్ల వరకు రానుంది. అయితే గ్యాస్ స్వాపింగ్ వల్ల అయ్యే వ్యయాన్ని చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించని పక్షంలో... మొత్తం వ్యయం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే జరిగితే మొత్తం 450 మెగావాట్లను రాష్ట్రమే తీసుకునే అవకాశాలున్నాయి.