‘రవాణా’లో ఇక ఎస్ఎంఎస్లు
తెలంగాణలో ‘నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు’
ప్రధాని మోదీ ఆదేశం మేరకు షురూ
దేశంలోనే తొలిసారి అమలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతోంది. పారదర్శక సేవలకు మెరుగులు పెడుతోంది. మరింత వేగంగా...మరెంతో బాధ్యతాయుతంగా నిత్యవ్యవహారాలను చక్కబెట్టబోతున్నది. దీంతో చాంతాడంత ‘క్యూ’లు, గంటలతరబడి వెయిటింగులు ఉండవు. చిటికెలో వ్యవహారాలను పూర్తిచేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఎస్ఎంఎస్ల ద్వారా వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ‘ఎస్’ అంటూ ముందుకుపోతోంది.
పరిపాలనలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు సత్వర, అత్యుత్తమ సేవలను అందజేయాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాన్ని రాష్ట్ర రవాణాశాఖ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా తాను అందించే అన్ని సేవలను సెల్‌ఫోన్ సంక్షిప్త సమాచారం (ఎస్ఎంఎస్)తో అనుసంధానించింది. ముఖ్యమైన విషయాలపై ముందస్తుగా అప్రమత్తం చేయడం, పని పూర్తి అయితే ఆ సమాచారాన్ని చేరవేయడం, ఏవైనా సమాచారం అవసరమైతే దానిపై వివరాలు కోరడం వంటివన్నీ మెస్సేజ్‌ల ద్వారానే చేసే పద్ధతికి శ్రీకారం చుట్టింది.
తద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు’ను రవాణాశాఖలో అమలుచేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసుకున్న రవాణాశాఖ తాజాగా దాని అమలును ఆరంభించింది. దీనికి సంబంధించి వాహనదారుల సెల్‌ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇక నుంచి అన్ని లావాదేవీల్లో ఫోన్‌నంబర్లు నమోదు చేసుకోబోతున్నారు. గతంలోనే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయిన వారి నంబర్లు క్రోడీకరిస్తున్నారు. ఏదేని పనికోసం రవాణాశాఖకు వస్తే ముందుగా వారి నంబర్ నమోదు చేయిస్తున్నారు.
ఏం చేస్తారు..ఎలా చేస్తారు ...?
కొత్తవాహనం రిజిస్ట్రేషన్ కాగానే అది ఎస్ఎంఎస్ రూపంలో వాహనదారు సెల్‌ఫోన్‌కు చేరుతుంది.
రిజిస్ట్రేషన్ అయిన తేదీ, సమయం, వాహనం నంబర్, ఇతర వివరాలన్నీ అందులో ఉంటాయి.
కోరిన నంబర్‌ను రిజర్వ్ చేసుకుంటే దాని వివరా లు కూడా ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు. చాలామందికి నంబర్ రిజర్వ్‌కు ఫీజు ఎంతో తెలియదు. ఏజెంట్ కోరినంత ముట్టజెప్పుతారు. ప్రస్తుతం ఫీజు ఈ ఎస్ఎంఎస్లో స్పష్టంగా ఉంటుంది.
రవాణాశాఖకు చెల్లించాల్సిన పన్నులు బకాయిపడితే వాటిని చెల్లించాల్సిన గడువును పేర్కొంటూ ఎస్ఎంఎస్ పంపుతారు.
ముందుగానే వాహనదారులను అప్రమత్తం చేస్తారు. వాహన పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు దగ్గరపడితే వాటిని రెన్యూవల్ చేసుకోవాలని సూచిస్తారు.
వయసు ఆధారంగా లెసైన్స్ గడువు తీరుతుంటే ఎప్పటిలోగా రెన్యూవల్ చేసుకోవాలో సమాచారం పంపుతారు.
వాహనదారు దరఖాస్తులను పెండింగులో పెట్టకుండా, అదనపు సమాచారం కోసం ఎస్ఎంఎస్లు పంపుతారు.
స్పందన బాగుంది: పాండురంగ నాయక్, జేటీసీ
‘ఈ కొత్త విధానం ఇటీవలే అమలులోకి వచ్చింది. దీనికి మంచి స్పందన ఉంది. పనుల్లో జాప్యం లేకుండా, పారదర్శకతకు అవకాశం కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు సమాచారం సెల్ఫోన్లో కనిపిస్తుండడంతో వాహనదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ తరహా సేవలను మరింత విస్తరించి వాహనదారులు సులభంగా ఆయా పనులు పూర్తి చేసుకునేలా చూస్తాం’