చేపల వేట... బతుకు బాట
మెదక్: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేం దుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ..తక్కువ స్థలంలో ఎక్కువ చేపలను పెంచడంతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు ‘‘పంజరంలో చేపల పెంపకం’’ అనే వినూత్న పద్ధతిని అవలంబిస్తోంది. ఈ మేరకు మత్స్యకారులను పశ్చిమబెంగాల్‌కు పంపి 5 రోజులపాటు శిక్షణ కూడా ఇప్పించింది. అంతేకాకుండా కేజ్ కల్చర్ చేపల పెంపకాన్ని జిల్లాలో అవలంభించేందుకు అధికారులు పోచారం రిజర్వాయర్‌ను ఎంపిక చేశారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ ప్రారంభమైతే రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.
మత్స్యకారులను ఆదుకునేందుకు..
తెలంగాణలోని మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రిజర్వాయర్లు..చెరువుల్లో కేజ్ (పంజరం) కల్చర్, పెన్ (దడి) కల్చర్ పద్ధతుల్లో చేపల పెంపకానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ఈ మేరకు మెదక్ ప్రాంతంలోని పోచారం రిజర్వాయర్‌ను ఎంపిక చేసింది. కేజ్ కల్చర్, పెన్ కల్చర్ పద్ధతుల్లో చేపలు పెంచేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సెంటర్ ఇన్లాండ్, ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (భారక్‌పూర్)లో ఈనెల 11 నుంచి 15వ తేదీవరకు 17 మంది మత్స్య కార్మికులకు శిక్షణ ఇప్పించినట్లు ఎఫ్డీఓ రాజనర్సయ్య తెలిపారు.
పంజరం(కేజ్), పెన్ కల్చర్లలో చేపల పెంపకం
తక్కువ స్థలంలో ఎక్కువ చేపలు పెంచుతూ అధిక దిగుబడులు సాధించేందుకు కేజ్ కల్చర్ పద్ధతిని సెంటర్ ఇన్లాండ్, ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(భారక్‌పూర్) రూపొందించింది. దీని ప్రకారం పది మీటర్ల లోతు ప్రాంతాన్ని ఎంచుకుని నలువైపుల వెదురు బొంగులు పాతుతూ.. చుట్టూరా జాలిని కట్టాలి. పక్షుల నుంచి, భక్షక చేపల నుంచి రక్షణ కల్పించేందుకు పై భాగంలో కూడా వల కడతారు. అలాగే పెన్(దడి) కల్చర్ పద్ధతిలో కూడా చెరువులో వెదురు బొంగులు పాతి చుట్టూ వలను కట్టి చేపలను పెంచుతారు. నేల, నీరు భౌతిక ధర్మాలకు సంబంధించిన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ...చేప పిల్లలకు ఆహారాన్ని ఇస్తారు. ఒక్కో పంజరంలో 3,500 చేప పిల్లలు (3 అంగులాల సైజు) వదులుతారు. 7 నుంచి 8 నెలల కాలంలో ఇవి కేజీ బరువు పెరుగుతాయి.
జాతీయ మత్స్యశాఖ అభివృద్ధి మండలి ఆర్థిక సాయం
కేజ్ కల్చర్, పెన్ కల్చర్ పద్ధతుల్లో చేపలు పెంచేందుకు ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందుకు గానూ మత్స్యకార్మికులకు జాతీయ మత్స్యశాఖ అభివృద్ధి మండలి 90 శాతం నిధులు సబ్సిడీపై అందజేస్తుంది. పదిశాతం నిధులు కార్మిక సంఘాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.3 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మెదక్ జిల్లాలో ఈ పద్ధతిలో చేపల పెంపకానికి పోచారం రిజర్వాయర్‌లో అవకాశం ఉన్నందున ఈ ప్రాజెక్ట్ అక్కడ చేపట్టడానికి మత్స్యకారులు ముందుకొస్తున్నారని మత్స్య శాఖ ఏడీఈ లక్ష్మినారాయణ తెలిపారు. కేజ్ కల్చర్ పద్ధతిని ప్రోత్సహించిన మత్స్యశాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ అధికారి సాయిబాబాకు మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బెస్త మొగులయ్య కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్లో శిక్షణ పొందాం
పంజరంలో చేపల పెంపకం పద్ధతిని తెలుసుకోవడానికి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాం. అక్కడ మైతాన్ ప్రాజెక్ట్, రాజేంద్రపూర్, నోయిటా, అకాయిపూర్ ప్రాంతాలను సందర్శించి ఈ పద్ధతులను పూర్తిగా తెలుసుకున్నాం. శాస్త్రవేత్త ఏ.కె.దాస్ యాజమాన్య పద్ధతులపై చక్కగా విశదీకరించారు.