స్వచ్ఛభారత్‌లో జాతీయ స్థాయి విజేతగా దీప
పులివెందుల రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై నిర్వహించిన జాతీయస్థాయి వ్యాసరచన పోటీలలో పులివెందులకు చెందిన నాగమణి దీప విజేతగా నిలిచింది. సింహాద్రిపురం మండలం కోవరంగుంటపల్లెకు చెందిన శేషన్న, పద్మావతి దంపతుల కుమార్తె దీప ప్రస్తుతం విజయవాడలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. దీప స్వచ్ఛభారత్‌పై తెలుగు మీడియంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గతేడాది రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచింది. ఈ రిపోర్టులను అధికారులు జాతీయస్థాయి ఎంపిక కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించారు. అక్కడ నిర్వహించిన పరిశీలనలో జాతీయ స్థాయిలో విజేతగా నిలిచినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
రాష్ట్రపతి నుంచి అవార్డు స్వీకరణ
ఈనెల 8న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి విద్యార్థి నాగమణి దీప మెడల్ అందుకున్నారు. మెడల్‌తోపాటు రూ.38 వేలు విలువ చేసే ల్యాప్‌ట్యాప్, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. జాతీయ స్థాయిలో రాణించిన దీపను నివేదిత పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్షీ్మనారాయణ, గౌరవ సలహాదారులు ఈశ్వరరెడ్డి, గంగిరెడ్డి, సురేష్ పాల్గొన్నారు.