National market
-
బంగారం కొండ దిగుతోంది..!
న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా సరికొత్త శిఖరాలతో వెలుగులు విరజిమ్మిన బంగారం... ఇప్పుడు కొండ దిగుతోంది!! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు తొలిసారి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలతో పుత్తడి ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధర పతనం అవుతోంది. దేశీయ స్పాట్ ప్రధాన మార్కెట్– న్యూఢిల్లీలో శుక్రవారం (ఆగస్టు 7వ తేదీ) 10 గ్రాములు స్వచ్చత ధర రికార్డు స్థాయిలో రూ.57,008 చూస్తే, బుధవారం నాటికి రూ.52,946కు దిగివచ్చింది. అంటే కేవలం మూడు రోజుల్లో రూ.4,062 తగ్గిందన్నమాట. మూడు రోజులుగా పసిడి ప్రతిరోజూ ఇక్కడ రూ.1,200కుపైగా తగ్గుతూ వచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగా పతనం అవుతుండడం గమనార్హం. 7వ తేదీన ఇక్కడి స్పాట్ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ.77,840కి చేరిన కేజీ వెండి ధర బుధవారానికి రూ.67,584కు చేరింది. మూడు రోజుల్లో వెండి రూ.10,256కు తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు పట్టణాల స్పాట్ మార్కెట్లలో కూడా పసిడి, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. 7వ తేదీ వరకూ వరుసగా 16 రోజులు ఏరోజుకారోజు దేశీయంగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం గమనార్హం. ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 9.30 గంటలు) దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర రూ.52,292 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం రికార్డు స్థాయిలో ధర రూ.55,850 చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఈక్విటీ మార్కెట్ పెరుగుదల ధోరణి నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ (ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో) దాదాపు స్థిరంగా ఉంది. బుధవారం ధర 74.83 వద్ద ఉంది. రూపాయికి ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). పరుగుకు రష్యా ‘వ్యాక్సిన్’ బ్రేకులు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభణ, కోవిడ్ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి, అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో బంగారం అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) గత శుక్రవారం (7వ తేదీ) ఒక దశలో చరిత్రాత్మక రికార్డుస్థాయి 2,078 డాలర్లకు చేరింది. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్ చేసిన జూలై 27 తర్వాత కేవలం 10 రోజుల్లోనే పసిడి ఈ స్థాయికి చేరడం గమనార్హం. అయితే ఈ స్థాయి వద్ద భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు దిగారు. దీనితో శుక్రవారం (7వ తేదీ) ట్రేడింగ్ చివర గంటల నుంచీ పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికితోడు కరోనా వ్యాక్సిన్ విడుదల చేసినట్లు స్వయంగా దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం పసిడి ధరకు మరింత ప్రతికూలం అయ్యాయి. బుధవారం ఈ వార్త రాసే 9.30 గంటల సమయానికి చరిత్రాత్మక గరిష్ట స్థాయిల నుంచి (2,078 డాలర్ల) చూస్తే, ధర 128 డాలర్లు పతనమై, 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 202 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూడ్డం గమనార్హం. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది గంటల్లోనే ధర కీలక నిరోధ స్థాయి (1,911 డాలర్లు)ని మళ్లీ దాటి, మంగళవారం ముగింపుకన్నా 12 డాలర్ల లాభంతో 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
కొనసాగుతున్న పసిడి పరుగు
న్యూఢిల్లీ: దేశీంగా బంగారం ధర జోరుమీద కొనసాగుతోంది. గతకొద్ది రోజులుగా జీవితకాల గరిష్టస్థాయిలను తిరగరాస్తూ.. తాజాగా మరో రికార్డు స్థాయిని నమోదుచేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల (బిస్కెట్ గోల్డ్) బంగారం ధర రూ.38,770 చేరుకుంది. ప్రాంతీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ క్రమంగా పెరిగిన కారణంగా ఇక్కడి ధర ఒక్క రోజులోనే రూ.200 పెరిగి ఆల్ టైం రికార్డు హైకి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నందున ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపునకు మళ్లడమే డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. మరోవైపు మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఒక దశలో 1,496.60 డాలర్లకు తగ్గింది. శుక్రవారం జాక్సన్ హోల్ ఎకనామిక్ పాలసీ సదస్సులో అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగం, ఎఫ్ఓఎంసీ జూలై సమావేశ మినిట్స్ వెల్లడి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1,500 డాలర్ల స్థాయిలోనే ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ కమోడిటీ విభాగం హెడ్ హరీష్ అన్నారు. శాంతించిన వెండి.. దేశ రాజధానిలో వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ఇండస్ట్రీ, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిన కారణంగా స్పాట్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.43,900 చేరుకుంది. బంగారు నగలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి! అందరితో చర్చించి నిర్ణయం బీఐఎస్ డైరెక్టర్ జనరల్ వెల్లడి కోల్‌కతా: బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలన్న తన ప్రతిపాదనను కేంద్రం మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)నోటిఫై చేయడం కోసం వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) డైరెక్టర్ జనరల్ సురైనా రాజన్ పేర్కొన్నారు. దీనితో సంబంధమున్న ముఖ్యంగా పుత్తడి వర్తకులతో సంప్రదింపులు అనంతరమే ఈ ప్రక్రియ కార్యరూపం దాలుస్తుందని ఆమె వివరించారు. గోల్డ్ హాల్‌మార్కింగ్‌కు సంబంధించి డిజిటైజేషన్ కార్యక్రమాన్ని ఐఐటీ–ముంబై అమలు చేస్తోందని, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాది పడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా హాల్‌మార్కింగ్ సెంటర్లను బీఐఎస్ కంట్రోల్‌తో అనుసంధానం చేస్తామని, పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థ సిద్ధమైన తర్వాతనే హాల్‌మార్కింగ్ కోడ్ జనరేట్ అవుతుందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 800 హాల్‌మార్కింగ్ సెంటర్లు ఉన్నాయని, మొత్తం బంగారు ఆభరణాల్లో 40 శాతానికి మాత్రమే హాల్‌మార్కింగ్ ఉందని తెలిపారు. -
స్థూల ఆర్థిక గణాంకాలతోనే దిశా నిర్దేశం..
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ముడిచమురు, రూపాయి కదలికల ఆధారంగా నూతన ఏడాది మొదటివారం ట్రెండ్ ఆధారపడి ఉందని చెబుతున్నారు. ‘భూగోళ రాజకీయ అంశాలు, అధిక స్థాయిల వద్ద కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి, వాణిజ్య యుద్ధాలు వంటి ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్లలో నెగటివ్ సెంటిమెంట్ అధికంగా ఉండేందుకు ఆస్కారం ఉంది.’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. మరోవైపు ముడిచమురు ధరల్లో కన్సాలిడేషన్ చోటుచేసుకోవడం, డాలరుతో రూపాయి బలపడడంతో పాటు స్థూల గణాంకాల ఆధారంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొనవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. వచ్చే ఏడాది రెండవ వారం నుంచి ప్రారంభంకానున్న క్యూ3 (అక్టోబర్–డిసెంబర్) ఫలితాలు మార్కెట్ దిశకు మరింత స్పష్టత ఇవ్వనున్నాయని వివరించారు. నికాయ్ గణాంకాల వెల్లడి.. ఎనిమిది కీలక రంగాల వృద్ధిరేటుకు సంబంధించిన సమాచారం ఈ వారంలోనే వెల్లడికానుండగా.. నవంబర్ నెల దేశీ మౌళిక సదుపాయాల నిర్మాణ సమాచారాన్ని ప్రభుత్వం సోమవారం వెల్లడించనుంది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరంగ్ పర్చేరింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) బుధవారం, నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈవారంలోనే ఆటోమొబైల్ కంపెనీలు తమ డిసెంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల డేటాను ప్రకటించనున్నాయి. ఎన్బీఎఫ్సీల్లో నెలకొన్న ద్రవ్య లభ్యత కొరత ఈసారి ఆటో డేటాపై ఉత్కంఠ నింపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓలా, ఉబెర్ వంటి ఆటో అగ్రిగేటర్ సంస్థల మద్దతుతో వాల్యూమ్స్ నిలబడే అవకాశం ఉందనే ఆశాభావం ఉన్నట్లు వ్యక్తంచేశారు. ఇక అంతర్జాతీయ గణాంకాల పరంగా చూస్తే.. అమెరికా, చైనా దేశాల డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ మొత్తం సమాచారాల ఆధారంగానే మార్కెట్ కదలికలు ఈవారంలో ఉండనున్నట్లు వినోద్ నాయర్ అన్నారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.5,477 కోట్లు ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా డిసెంబర్ 3–28 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ)లు రూ.5,477 కోట్లను దేశీ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,900 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.3,577 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు తేలింది. 71–72 శ్రేణిలో రూపాయి.. గడిచిన వారంలో ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 52.20 డాలర్లకు పతనం కాగా, యూఎస్ క్రూడ్ 45.12 డాలర్లకు పడిపోయి.. వరుసగా మూడవ వారంలోనూ పతనాన్ని నమోదుచేశాయి. అక్టోబర్ గరిష్టస్థాయిల నుంచి 39 శాతం, ఏడాది ప్రాతిపదికన 17 శాతం పడిపోయాయి. ఉత్పత్తిలో కోత కారణంగా బ్రెంట్ ధర 50 డాలర్ల సమీపంలో బోటమ్ కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు డబ్ల్యూటీఐ ధర మరింత పతనమైతే యూఏఈ, రష్యాలు అత్యవసర సమావేశానికి పిలుపునివ్వగా.. ఇందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆనంద్ రాఠీ కమోడిటీస్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ హెచ్ రవీంద్ర వీ రావు విశ్లేషించారు. ఇక గతవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.93 వద్దకు చేరుకుంది. అమెరికా డాలర్ బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్ బలపడటం వంటి సానుకూల అంశాలతో రూపాయి విలువ బలపడింది. దిగుమతిదారులు అన్హెడ్జ్ పొజిషన్లను కవర్చేసుకోవడం కోసం వచ్చే కొద్ది సెషన్లలో క్యూ కట్టవచ్చని ఈకారణంగా రానున్న సెషన్లలో రూపాయి 71–72 స్థాయిలో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. -
ఈ ట్రేడింగ్
♦ జాతీయ విపణిలో మన ఆహార ఉత్పత్తులు ♦ ఈ-బిడ్డింగ్‌తో విక్రయించుకునే వెసులుబాటు ♦ ప్రయోగాత్మకంగా మూడు మార్కెట్లలో అమలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నిన్నటి వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఐదు అంకెల జీతం తీసుకునే వాళ్లు మాత్రమే ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాళ్లు. దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు పలు నగరాల్లోని షేర్మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ సంబరపడిపోయేవారు. అలాంటి వ్యాపారమే అన్నదాతలకు అందుబాటులోకి రానుంది. తాండూరు కందుల రైతులతోపాటు వివిధ ఆహార ఉత్పత్తుల రైతులకు ఈ అరుదైన అవకాశం చిక్కనుంది. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, శంకర్పల్లి మార్కెట్లలో ఆన్లైన్ బిడ్డింగ్ కోసం అన్ని హంగులు కల్పించేందుకు జిల్లా మార్కెటింగ్ అధికారులు కసర త్తు సాగిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ విపణిలో అమ్ముకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. రైతులేమిటి? ఆన్లైన్ ట్రేడింగ్ ఏమిటి అనుకుంటున్నారా? అది ఎలాగో మీరే చదవండి. బషీరాబాద్‌కు చెందిన వెంకటరె డ్డి 30 బస్తాల కందులు పండించారు. సమీపంలోని తాండూరు మార్కెట్లోకి ఆయన లారీ ప్రవేశించగానే కంప్యూటర్లో పంట ఉత్పత్తుల వివరాలు, రైతు సమాచారాన్ని నమోదు చేస్తారు. అక్కడే ఏర్పాటుచేసే అధునాతన ల్యాబ్‌లో కంది నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్ నిర్ణయిస్తారు. తద్వారా ధరను ప్రకటిస్తారు. ఈ వివరాలను ఈ- బిడ్డింగ్‌లో ఎంట్రీ చేస్తారు. దీంతో దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ (నామ్)తో అనుసంధానం చేయడం ద్వారా ఏకకాలంలో 500 మార్కెట్ కమిటీలో ఈ- ట్రేడింగ్ జరిపేందుకు వీలు కలుగుతుంది. ఉత్పత్తి, నాణ్యత నచ్చిన వ్యాపారులు ఆ పంటను ఈ -బిడ్డింగ్‌లో కోట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిర్దేశిత మొత్తం రైతు ఖాతాలో జమకానుంది. అదే సమయంలో ప్రస్తుతం క మీషన్ ఏజెంటు కేవలం నిర్దేశిత మార్కెట్లోనే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అనుమతి ఉంది. కొత్త విధానం అమలు చేయడం ద్వారా ఈ ఏజెంటు దేశవ్యాప్తంగా 500 మార్కెట్లలోని ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే అవకాశం కలుగనుంది. -
మార్కెట్లోకి కొత్త యూరియా!
కేంద్రం ఆదేశంతో ‘వేపనూనె’ యూరియాను తీసుకొచ్చిన కంపెనీలు సాక్షి, హైదరాబాద్: దేశీయ మార్కెట్లోకి కొత్త రకం యూరియా వచ్చింది. మనదేశంలో తయారవుతున్న యూరియాలో కనీసం 35 శాతం వేపనూనె పూత యూరియా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు ఈ యూరియాను తీసుకొచ్చారు. రాష్ట్రంలో అత్యధికంగా యూరియాను సరఫరాచేసే ‘క్రిషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్’(క్రిభ్కో) ఇప్పటికే 65వేల టన్నుల వేప నూనె పూత ఉన్న యూరియాను మన మార్కెట్లో ఉంచగా, నాగార్జున ఫెర్టిలైజర్స్ మరో 10వేల టన్నుల యూరియాను అందుబాటులో ఉంచింది. యూరియా వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ చర్య వల్ల రైతులకు ప్రయోజనం కలగడమే కాకుండా యూరియా దిగుమతులు తగ్గి ఏడాదికి దాదాపు 99 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5,940 కోట్లు) విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న యూరియాలో పైర్లకు 30 శాతం అందుతుండగా.. మిగిలిన 70 శాతం గాలిలో, భూమిలో వృథా అవుతుంది. యూరియాకు వేప నూనె పూత ఉంటే ఈ వృథా గణనీయంగా తగ్గుతుంది. చాలాకాలం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు యూరియాకు వేప నూనె పూత వేయమని రైతులకు సలహా ఇస్తూ ఉన్నారు. అయితే రైతు స్థాయిలో ఇలా చేయడంలో ఉన్న ఇబ్బందుల రీత్యా ఈ సలహాను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో యూరియా ఉత్పత్తి దశలోనే వేప నూనె పూత ఉండేలా చూసేందుకు కేంద్రం నడుంబిగించింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 35 శాతం యూరియాకు వేపనూనె పూత తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. దీంతో సంబంధిత యూరియా కంపెనీలు వారి కర్మాగారాల్లో అందుకు తగిన మార్పులు చేసుకుంటున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో వేప పూత యూరియానే మార్కెట్లో ఉంచేలా చేసేందుకు కసరత్తు జరుగుతోంది. బస్తాకు రూ.14 అదనం... ప్రస్తుతం మామూలు యూరియా 50 కిలోల బస్తా ధర రూ.284 ఉండగా, వేప నూనె పూత పూసిన యూరియా బస్తా ధరను రూ.298గా ప్రభుత్వం నిర్ణయించింది. బస్తాకు రూ.14 అదనంగా చెల్లించినా, ఐదు బస్తాల మామూలు యూరియా వాడాల్సిన చోట వేప నూనె పూత ఉన్న యూరియా నాలుగు బస్తాలు వేస్తే సరిపోతుంది. వేప నూనె పూత యూరియా వాడకం పూర్తిస్థాయిలో అలవాటైతే దేశవ్యాప్తంగా 30 లక్షల టన్నుల యూరియా వాడకం తగ్గే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా 3 కోట్ల టన్నుల యూరియా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షల టన్నుల యూరియా వినియోగంలో ఉంది. వేప నూనె పూత పూసిన యూరియా వాడినట్లయితే కనిష్టంగా 10 శాతం యూరియా వినియోగం తగ్గుతుంది. దీంతో ఆ మేరకు యూరియా దిగుమతులను తగ్గించుకోవచ్చని క్రిభ్కో అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టన్ను యూరియా 330 డాలర్లు పలుకుతోందని, ఈ లెక్కన మనకు దాదాపు 99 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు. క్రిభ్కో, నాగార్జున ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఉజ్వల యూరియా)లు మన రాష్ట్రానికి ప్రధానంగా యూరియా సరఫరా చేస్తున్నాయి.