సేంద్రియ వ్యవసాయమే మేలు
- రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి
- ప్రకృతి వ్యవసాయం, సుస్థిర సాగు పద్ధతుల వైపు అడుగులు వేయాలి
- రసాయనాలతో మానవాళికి ముప్పు
- ప్రారంభమైన జాతీయ సేంద్రియ సదస్సు
సాక్షి, హైదరాబాద్: రసాయనాలు వాడే ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వాతావరణం. ప్రజారోగ్యం, భూసారం దెబ్బతింటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. విపరీతమైన రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం ఉండే ఆధునిక సాగుపద్ధతుల పోకడ వల్ల మానవజాతి మనుగడకే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అందువల్ల సమగ్ర వ్యూహా లతో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ‘పంటల సాగు–సేంద్రియ ధ్రువీకరణ’ అంశంపై శనివా రం ఇక్కడ జాతీయస్థాయి సదస్సు ప్రారంభమైంది.
పార్థసారథి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం, సుస్థిర సాగు పద్ధతుల వైపు అడుగులు వేయాల్సి ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయానికి రాష్ట్రంలో విస్తారమైన అవకాశాలున్నాయన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ ఉత్పత్తిని పరిమాణం వైపు నుంచి చూశామని, ఇప్పుడు నాణ్యతవైపు నుంచి చూడాల్సిన అవసరముందన్నారు. తక్కు వ వ్యయంతో ఎక్కువ ఫలితాలు సాధించాలన్నారు. ఉత్పాదకత విషయంలో రాజీపడకుండా ముందుకు సాగేందుకు ‘ఐకార్’ ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించిందన్నారు. కేంద్రం పరంపరాగత్ కృషి వికాస్ యోజన పేరుతో సేంద్రియ వ్యవసాయానికి ఊతమిస్తోందన్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు శాస్త్రవేత్తల పరిశోధన తోడుకావాలన్నారు.
కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, మానవ మనుగడకు సేంద్రియ వ్యవసాయం ఒక ముందడుగు అవుతుందన్నారు. మనం సరైన ఆలోచనలు చేయకపోతే ఈ భూగోళం ఇంకో వందేళ్లు బతకడానికీ పనికిరాదన్న స్టీఫెన్ హాకింగ్ హెచ్చరికలపై ఆలోచన చేయాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ, విద్యార్థుల పాఠాల్లో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మాట్లాడుతూ చిన్న రైతులకు మేలు కలిగేలా సేంద్రియ సాగు పద్ధతులు ఉండాలన్నారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ఫ్లాజాలో ప్రారం భమైన ఆర్గానిక్ మేళాలో ఆది వారం ఉదయం 10.30 నుంచి రాత్రి 9.30 వరకు 2 ఫుడ్ కోర్టులు, 40 సేంద్రీయ స్టాళ్లు ప్రజల కోసం అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.