జాతీయ స్కూల్ క్రీడల నిర్వహణ కష్టమే!
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఈ ఏడాది జరగాల్సిన జాతీయ స్కూల్ క్రీడలు నిర్వహించడం కష్టంగా మారింది. అక్టోబర్ మొదటి వారం నుంచి తాడేపల్లిగూడెంలో జాతీయ స్కూల్ అండర్-14, 17, 19 బాలబాలికల చెస్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జాతీయ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్‌ను నిర్వహించలేని పరిస్థితి ఉందని పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనరేట్ అధికారులకు తెలిపారు. అలాగే కర్నూలులో జాతీయ అండర్-19 బాలబాలికల తైక్వాండో టోర్నమెంట్ అక్టోబర్ మొదటి, రెండో వారంలో జాతీయ స్కూల్ అండర్-14, 17, 19 బాలబాలికల ఫెన్సింగ్ టోర్నమెంట్ పోటీలు జరగాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్టోబర్ 13 నుంచి జాతీయ అండర్-19 బాలికల క్రికెట్ టోర్నమెంట్‌ను జరపాలి. వీటి నిర్వహణ కూడా అనుమానమేనని ఇప్పటికే ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు, స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శులు రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే ఈపోటీలను హైదరాబాద్ లేదా తెలంగాణ జిల్లాల్లోనైనా నిర్వహించి తమ పిల్లలకు న్యాయం చేయాలని పలువురు చెస్ క్రీడాకారుల తల్లిదండ్రులు రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వాణి మోహన్ కలిసి విజ్ఞప్తి చేశారు.
దీంతో ఆమె స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి విజయారావును ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈనెల 29 నుంచి తాడేపల్లిగూడెంలో జరగాల్సిన రాష్ట్ర అండర్-14, 17, 19 చెస్ టోర్నమెంట్‌ను అక్టోబర్ 8 నుంచి రంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్నట్లు సమాచారం.